Updated : 19 Aug 2020 15:03 IST

నోటి దురుసు ఖురేషీది.. ప్రాయశ్చిత్తం భజ్వాది

 సౌదీని ప్రసన్నం చేసుకోవడం కోసం పాక్‌ సైన్యాధిపతి అవస్థలు

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ ఈ విషయం పాకిస్థాన్‌కు ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. కశ్మీర్‌ విషయంలో భారత్‌తో కయ్యానికి తోడురావడంలేదని  పాక్‌కు కోపం వచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ ఆగస్టు 5వ తేదీన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ పరోక్షంగా సౌదీ అరేబియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల ఫలితాన్ని పాక్‌ అనుభవిస్తోంది. ఆర్థికంగా అండగా నిలిచిన సౌదీ.. ఇప్పుడు మెల్లిగా పక్కకు తప్పుకోవడంతోపాటు.. గతంలో ఇచ్చిన అప్పులను వసూలు చేయడం మొదలుపెట్టింది. ఓ పక్క కరోనావైరస్‌.. మరోపక్క ఆర్థిక ఇబ్బందులతో పాక్‌ పరిస్థితి ఘోరంగా తయారైంది. చివరికి సౌదీ రాజు అపాయింట్‌మెంట్‌ కూడా పాక్‌ ఆర్మీ చీఫ్‌ భజ్వాకు దొరకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

అసలేం జరిగింది..

ముస్లిం దేశాల్లో రెండు వర్గాలు ఉన్నాయి. పెద్ద వర్గానికి సౌదీ నాయకత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి ఇరాన్‌, టర్కీ నాయకత్వం వహిస్తున్నాయి. దీంతో సౌదీకి ఈ దేశాలకు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అమెరికాతో సన్నిహితంగా ఉండే సౌదీ కేవలం చమురుతోనే ఇస్లాం ప్రపంచంపై పట్టు సాధించలేమని గుర్తించింది. దీంతో మెల్లగా దేశంలో ఇతర రంగాలను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా, భారత్‌, ఐరోపా సంఘం మద్దతు సౌదీకి చాలా అవసరం. దాదాపు 130 కోట్ల మంది ఉన్న భారత మార్కెట్‌ను దూరం చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) గ్రహించారు. అందుకే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగించినప్పుడు కూడా స్పందించలేదు. ఇది పాకిస్థాన్‌కు కొంత కోపం తెప్పించింది.  

సౌదీ ప్రత్యామ్నాయానికి పాక్‌ మద్దతు..

57 దేశాలు ఉన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌‌(ఓఐసీ)లో  సౌదీ, యూఏఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని సవాలు చేసే విధంగా మరో ప్రత్యామ్నాయ సంస్థను ఏర్పాటు చేసేందుకు టర్కీ, ఇరాన్‌, ఖతార్‌, మలేషియా ప్రయత్నించాయి. ఈ క్రమంలో గతేడాది ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా వెళ్లేందుకు  సౌదీ యువరాజు విమానం పంపించారు. కానీ, అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌ టర్కీ, మలేషియాలతో అంటకాగుతున్నట్లు గ్రహించి తన విమానాన్ని వెనక్కి తెప్పించారు. దీంతో పాక్‌ ప్రధాని సాధారణ విమానంలో వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కౌలాలంపూర్‌లో టర్కీ, మలేషియా గతేడాది ఓ సమావేశం  ఏర్పాటు చేశాయి. దీనికి తొలుత పాక్‌ మద్దతు తెలిపినా.. సౌదీ కన్నెర్ర చేయడంతో ఈ సదస్సు నుంచి వైదొలగింది. నాటి నుంచి పాక్‌పై సౌదీకి అనుమానాలు పెరిగాయి. 

పాక్‌ నుంచి సాయం వాపస్‌..

ఈ ఏడాది ఆగస్టు 5తో ఆర్టికల్‌ 370 తొలగించి ఏడాది పూర్తయింది.. ఈ సందర్భంగా పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి సౌదీ అరేబియాను బహిరంగంగానే విమర్శించారు. కశ్మీర్‌ విషయంలో తమతో కలిసి రావడంలేదని.. కలిసి వచ్చేవారితోనే పనిచేస్తామని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యల్లో ఓఐసీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామనే అర్థం ధ్వనించడంతో సౌదీ అరేబియాకు కోపం వచ్చింది. పాక్‌ చర్యకు ప్రతిచర్య ఆ దేశ ఖజానాలో కనిపించింది. సౌదీ రుణంగా ఇచ్చిన 3 బిలియన్‌ డాలర్లను వాపస్‌ తీసుకోవడం మొదలుపెట్టింది. దీంతో చైనా నుంచి అప్పు తెచ్చి బిలియన్‌ డాలర్లను వాపస్‌ చేసింది. 

భారత్‌తో కయ్యం పెట్టుకోవాలని పదేపదే పాక్‌ ఒత్తిడి తేవడం సౌదీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో పాకిస్థాన్‌ సైన్యాధిపతి కమర్‌ జావెద్‌ భజ్వా రంగంలోకి దిగి ఇరు దేశాల సంబంధాలను పూర్వస్థితికి తెచ్చేందుకు సౌదీకి పయనమయ్యారు. అక్కడ ఆయనకు యువరాజు సల్మాన్‌ అపాయింట్‌మెంట్‌ కూడా లభించలేదు. కేవలం రక్షణ శాఖ ఉపమంత్రి ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌.. మిలటరీ చీఫ్‌ ఫయాద్‌తో భేటీ మాత్రమే జరిగింది. ఇది పాక్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. గతంలో అయితే అమెరికా సాయం చేసేది.. ఇప్పుడు పాక్‌ పూర్తిగా చైనా పక్షాన చేరడంతో ఆ సాయం కూడా లభించలేదు.  

ఇమ్రాన్‌ సెక్రటరీపై చెయ్యి చేసుకొన్న ఖురేషీ

సౌదీ అరేబియాను ప్రసన్నం చేసుకొనేందుకు పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీని పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్థానంలో షరీన్‌ మజారీ అనే మరో మంత్రికి అవకాశం కల్పించవచ్చు.  ఖురేషీ వ్యాఖ్యలపై ఇప్పటికే షరీన్‌ మండిపడ్డారు. ఈ ఘటనతో ఇమ్రాన్‌ ప్రభుత్వం ఖురేషీకి దూరంగా జరుగుతోందని పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. తర్వాత దశలో ఖరేషీని తప్పించవచ్చు. ఇప్పుడు ఖురేషీ మరో వివాదంలో కూడా ఇరుక్కున్నారు. ఖురేషీ ప్రధాని కార్యాలయానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆయన్ను లోపలకు రానీయలేదు. దీంతో ఏకంగా ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆజమ్‌ ఖాన్‌ను ఖురేషి చెంపదెబ్బ కొట్టినట్లు పాక్‌ న్యూస్‌ ఛానల్‌ పేర్కొంది. అంతకు ముందు అజమ్‌ ఖాన్‌.. ఖురేషీలు పరస్పరం దూషించుకొన్నారు. పాక్‌ దూరం అయ్యే కొద్దీ సౌదీ భారత్‌కు దగ్గరవుతోంది. ఇప్పటికే భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా గతేడాది రిలయన్స్‌లో వాటాలు కొనుగోలు చేసింది. ఈ పరిస్థితుల్లో పాక్‌ మాటలు విని వివాదాల్లో ఇరుక్కొనే ఉద్దేశం ఎంబీఎస్‌కు లేదు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్