SC: ఒత్తిడికి తలొగ్గి.. ప్రాణాల్ని పణంగా పెడతారా..?

బక్రీద్ పండుగను పురస్కరించుకొని కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు కొవిడ్ ఆంక్షలను సడలించడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 20 Jul 2021 14:08 IST

బక్రీదు సడలింపులు.. కేరళపై సుప్రీం ఆగ్రహం

దిల్లీ: బక్రీద్‌ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు కొవిడ్ ఆంక్షలను సడలించడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపార వర్గాల ఒత్తిడికి లోబడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించింది. అయితే ఆంక్షల సడలింపులపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రం కోర్టు రద్దు చేయలేదు.

‘ఒత్తిళ్లకు తలొగ్గడం పౌరుల జీవించే హక్కుకు భంగం కలిగించడం కిందికే వస్తుంది. అలాగే కాంవడ్ యాత్రలో భాగంగా యూపీ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను గమనించాలి. ఈ సడలింపుల కారణంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే.. ప్రజలు మా దృష్టికి తీసుకురావచ్చు. చర్యలు తీసుకుంటాం’ అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఆంక్షల సడలింపులపై ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకుంది. జూన్ 15 నుంచి ఆంక్షల సడలింపు కొనసాగుతోందని, ఇందులో కొత్తేమీ లేదని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. బక్రీద్ సందర్భంగా జులై 18 నుంచి 20వ తేదీ వరకు దుకాణాలను ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు తెరిచి ఉంచేందుకు కేరళ ప్రభుత్వం వెలుసుబాటు కల్పించింది. ఈ రోజు చివరి రోజు కావడంతో సడలింపులపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందంటూ వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని