Parliament: రెండోవిడత బడ్జెట్‌ సమావేశాలు.. వ్యూహాలతో అధికార, విపక్షాలు సిద్ధం

పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండోవిడత సమావేశాలు (Budget session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనాన్స్‌ బిల్లు (Finance Bill) ఆమోదం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. అటు విపక్షాలు మాత్రం అదానీ వ్యవహారం (Adani Group), దర్యాప్తు సంస్థల దాడులను ప్రధానంగా ప్రస్తావించేందుకు సిద్ధమయ్యాయి.

Updated : 12 Mar 2023 20:20 IST

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండోవిడత సమావేశాలు (Budget session) సోమవారం నుంచి మొదలుకానున్నాయి. దీంతో ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందడమే ప్రాధాన్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు, అదానీ వ్యవహారం (Adani Group), ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధమయ్యాయి.

రెండోదఫా బడ్జెట్‌ సమావేశాలు మార్చి 13న మొదలై ఏప్రిల్‌ 6వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం 10గంటలకు పార్లమెంట్‌ ప్రాంగణంలో సమావేశం కానున్నాయి. ముఖ్యంగా అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేందుకు పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ నేత కే సురేష్‌ పేర్కొన్నారు. దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (JPC) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. భాజపా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలనే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దీంతో ఇటీవల జరుగుతోన్న సీబీఐ, ఈడీ దాడులు, అరెస్టుల అంశాన్ని ఉభయసభల్లో లేవనెత్తేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ మాట్లాడుతూ.. ఆర్థికబిల్లును ఆమోదించుకోవడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమన్నారు. తొలుత ఇది ఆమోదం పొందిన తర్వాతే విపక్షాల డిమాండ్లపై చర్చిస్తామన్నారు.

ఇదిలాఉంటే, పార్లమెంట్‌ తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న మొదలై ఫిబ్రవరి 13వరకు కొనసాగాయి. అనంతరం నెలపాటు వచ్చిన విరామంలో వివిధ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ పద్దులను అన్ని స్థాయీ సంఘాలు నిశితంగా పరిశీలించాయి. అవి సమర్పించిన నివేదికలపై చర్చ, ఆమోదం జరుగుతుంది. సోమవారం (మార్చి 13) నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్‌ 6వరకు ఇవి కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ జన్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు