Gyanvapi Mosque: శివలింగం ప్రదేశాన్ని రక్షించండి.. కానీ నమాజ్‌ ఆపొద్దు: సుప్రీంకోర్టు

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం లభ్యమైన ప్రదేశాన్ని సంరక్షించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌ను......

Published : 17 May 2022 21:19 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం లభ్యమైన ప్రదేశాన్ని సంరక్షించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదులో వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మసీదులో నమాజ్‌ చేసుకొనేందుకు ముస్లింలకు అనుమతిచ్చింది. ప్రార్థనల కోసం మసీదుకు వచ్చే ముస్లింలను మాత్రం అడ్డుకోరాదని స్పష్టం చేసింది. ఈ అంశం వారణాసి సివిల్‌ కోర్టు ముందు ఉన్న నేపథ్యంలో తదుపరి చర్యలపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

యూపీ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటనపై వీడియో గ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హిందూ పిటిషనర్లకూ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై విచారణను మే 19కి వాయిదా వేసింది. 

మరోవైపు, జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణం వీడియోగ్రఫీ సర్వేచేసిన కమిషన్‌ నివేదిక సమర్పించేందుకు వారణాసి కోర్టు మరో రెండు రోజులు గడువు ఇచ్చింది. నివేదిక పూర్తికానందున అదనపు సమయం కావాలని కమిషన్‌ కోరడంతో కోర్టు గడువు మంజూరు చేసింది. క్షేత్రస్థాయిలో సహకరించడంలేదనే కారణంతో కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ మిశ్రాను కోర్టు కమిషన్‌ నుంచి తొలగించింది. జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకొనేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వేచేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో ఈ నెల 14 నుంచి 16 వరకు కమిషన్‌ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. అయితే, ఆ నివేదిక పూర్తిస్థాయిలో సిద్ధంకాని నేపథ్యంలో కమిషన్‌ కోర్టును అదనపు సమయం కోరడంతో కోర్టు గడువును రెండు రోజుల పాటు పొడిగించింది.

వీడియో గ్రఫీ సర్వే సందర్భంగా మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించగా.. ఆ ప్రదేశాన్ని సీల్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అధికారుల్ని సోమవారం ఆదేశించారు. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని