Amit shah: భద్రతా వైఫల్యం.. అమిత్ షా కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు..!

కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) కాన్వాయ్‌లోకి ఓ ప్రైవేటు కారు వేగంగా దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. త్రిపురలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 09 Mar 2023 11:20 IST

అగర్తల: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit shah) త్రిపుర పర్యటనలో భద్రతా వైఫల్యం (Security lapse) చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోకి ఓ కారు వేగంగా దూసుకురావడం తీవ్ర అలజడి సృష్టించింది. అమిత్‌ షా అగర్తల ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. అధికారుల కథనం ప్రకారం..

త్రిపుర (Tripura) ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమిత్ షా (Amit shah) బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగించుకొని తిరుగుపయనమవుతుండగా భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం గెస్ట్‌ హౌస్‌ నుంచి అగర్తల (Agartala) విమానాశ్రయానికి అమిత్ షా కాన్వాయ్‌ వెళ్తుండగా.. ఆ మార్గంలో అధికారులు సాధారణ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఆగకుండా తన కారులో ముందుకొచ్చాడు. పోలీసులు ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు వేగంగా కాన్వాయ్‌ (Convoy)లోకి దూసుకురావడం కలకలం సృష్టించింది.

అయితే ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. కాగా.. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనను కేంద్ర దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్లు సమాచారం.

త్రిపురలో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా, అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భాజపా కూటమి 32 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని