Sena vs Sena: ఠాక్రేకు సుప్రీం షాక్‌.. అసలైన ‘శివసేన’పై నిర్ణయం ఈసీదే

శివసేన (Shiv Sena)లో చీలిక జరిగిన తర్వాత నుంచి ఆ పార్టీపై హక్కుల కోసం జరుగుతున్న పోరులో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)కు

Published : 27 Sep 2022 17:47 IST

దిల్లీ: శివసేన (Shiv Sena)లో చీలిక జరిగిన తర్వాత నుంచి ఆ పార్టీపై హక్కుల కోసం జరుగుతున్న పోరులో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) చేసిన వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతినిచ్చింది. ఠాక్రే, శిందే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రాష్ట్రంలో ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున శిందే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని ఠాక్రే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది.

అయితే ఠాక్రే వర్గం అభ్యర్థనను పక్కనబెట్టిన ఎన్నికల సంఘం దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసింది. విల్లంబుల గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలను సమర్పించాలని శిందే, ఉద్ధవ్‌ వర్గాలకు ఈసీ సూచించింది. శివసేన శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండు వర్గాలను కోరింది. దీంతో ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా తేలలేదు గనుక.. శిందే వర్గం పెట్టుకున్న అర్జీపై ఈసీ చర్యలు తీసుకోకుండా నివారించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారించిన సుప్రీంకోర్టు.. ఈసీ ప్రక్రియపై స్టే విధించింది.

తాజాగా మంగళవారం దీనిపై మరోసారి విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం.. ఠాక్రే వర్గం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఠాక్రే, శిందే వర్గంలో అసలైన శివసేనను గుర్తించడం, పార్టీ ఎన్నికల గుర్తును కేటాయించడంలో ఈసీ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని