హిమపాతం.. 4500 వాహనాలకు బ్రేక్!

జమ్ముకశ్మీర్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి, మొఘల్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో దాదాపు 4,500 పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ‘‘ హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్‌ రహదారిని మూసివేశాం. ప్రధానంగా...

Updated : 14 Jan 2022 13:13 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి, మొఘల్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో దాదాపు 4,500 పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ‘‘ హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్‌ రహదారిని మూసివేశాం. ప్రధానంగా జవహర్‌ సొరంగ మార్గం ద్వారా రాకపోకలు పూర్తిగా నిలిపివేశాం’’ అని ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 260 కిలోమీటర్ల రహదారి పొడవునా ఎక్కడికక్కడ మంచు తొలగించి రాకపోకలకు మార్గాన్ని సుగమం చేస్తున్నామన్నారు. మరోవైపు జమ్ము నగరాన్ని కశ్మీర్‌లోయను కలుపుతూ నిర్మించిన మొఘల్‌ రోడ్డును గత వారం రోజులుగా అధికారులు మూసివేశారు. దక్షిణకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో అత్యధిక హిమపాతం నమోదైనట్లు వెల్లడించారు. రహదారులపై రెండుమూడు అడుగులమేర మంచుపేరుకుపోయినట్లు చెప్పారు. 

మరోవైపు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో శ్రీనగర్‌ నుంచి విమానాల రాకపోకలు కూడా వరుసగా రెండో రోజు నిలిచిపోయాయి. కశ్మీర్‌లోయలోని వివిధ చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్‌లో తాజాగా 0.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా...ఆదివారం రాత్రి -1.5 డిగ్రీలు నమోదైంది. గుల్మార్గ్‌లో గత రెండు రోజులుగా -5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బనిహల్‌-రాంబన్‌, పూంచ్‌, రాజౌరి, కిస్తావర్‌, ద్రాస్‌ తదితర ప్రాంతాల్లోనూ మంచు ఎక్కువగా కురుస్తోందని, మరో రెండుమూడు రోజులు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని