ఆస్పత్రులకు ఆక్సిజన్‌.. రెమ్‌డెసివర్‌ పంపండి

ఆస్పత్రులకు తగినన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌లు, వెంటిలేటర్లు, మరిన్ని

Published : 18 Apr 2021 00:52 IST

న్యూదిల్లీ: ఆస్పత్రులకు తగినన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌లు, వెంటిలేటర్లు, మరిన్ని వ్యాక్సిన్‌ డోస్‌లను పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు కోరాయి. దేశంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కరోనా కేసుల వివరాలను ఆయా రాష్ట్రాలు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు హర్షవర్ధన్‌ తెలిపారు. ‘అత్యధిక రాష్ట్రాలు ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత తీర్చాలని కోరాయి. అదేవిధంగా రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ అందుబాటులోకి ఉంచమన్నాయి. మహారాష్ట్రలో డబుల్‌ మ్యూటెంట్‌పై ప్రధానంగా చర్చజరిగింది. అదనపు పడకలను ఏర్పాటు చేయాలని దిల్లీ కోరింది’ అని హర్షవర్ధన్‌ సమావేశ వివరాలను వెల్లడించారు.

రాష్ట్రాలు కూడా కొవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని హర్షవర్ధన్‌ సూచించారు. ఇప్పటికే రాష్ట్రాల వద్ద 1.58 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు ఉన్నాయని, ఇంకా 1.16 కోట్ల డోస్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న రాష్ట్రాలు ప్రతి ఏడు రోజులకు, పెద్ద రాష్ట్రాలు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి వ్యాక్సిన్‌ నిల్వలను సమీక్షించుకోవాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా రాష్ట్రాల వైద్య అవసరాలను తీరుస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని