Siddaramaiah: రోడ్లను దిగ్బంధించిన కేసులో.. సిద్ధూకు ఊరట

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)పై నమోదైన ఓ కేసులో విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 

Published : 19 Feb 2024 14:25 IST

దిల్లీ: రోడ్లను దిగ్బంధించి ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ నమోదైన కేసులో కర్ణాటక(Karnataka) సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో సహా ఇతరులపై జరుగుతోన్న విచారణపై సుప్రీంకోర్టు(Supreme Court) స్టే విధించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేసింది. 

గత భాజపా ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన గ్రామంలో చేసిన పనులకు 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. ఇందులోభాగంగా నాటి సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు మార్చ్‌ చేపట్టగా.. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను తోసిపుచ్చిన ఆ రాష్ట్ర హైకోర్టు.. ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది. అలాగే రూ.10వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని