UP: మీ మాటలు నేతలు వినగలిగితే ఎంత ఎంత బాగుండు..!

త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటుబ్యాంకుపైనే ప్రధానంగా దృష్టి సారించింది. వారిని ఆకట్టుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తోంది.

Published : 05 Jan 2022 01:45 IST

తొక్కిసలాటను తలపించిన బాలికల మారథాన్‌.. మాస్కు ముచ్చటే లేదు..!

నిబంధనలను పట్టించుకోని పార్టీలు

లఖ్‌నవూ: త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటుబ్యాంకుపైనే ప్రధానంగా దృష్టి సారించింది. వారిని ఆకట్టుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తోంది. ‘లఢకీ హూ, లఢ్‌ శక్తీ హూ (నేను అమ్మాయిని, నేను పోరాడగలను) అంటూ తలపెట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం మారథాన్‌ను నిర్వహించింది. వందల సంఖ్యలో బాలికలు పాల్గొన్న ఆ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిర్వహణ సరిగా లేక తొక్కిసలాటను తలపించింది. కరోనా వేళ తలపెట్టిన ఆ మారథాన్‌లో మాస్కుల ఛాయలే కనిపించలేదు. 

రాయబరేలీలో జరిగిన ఈ మారథాన్‌లో వందల సంఖ్యలో బాలికలు పాల్గొన్నారు. దాంతో పోటీని నిర్వహిస్తోన్న దారి అంతా పూర్తిగా నిండిపోయింది. పోటీ ప్రారంభం కాగానే రద్దీ కారణంగా ముందు వరుసలో ఉన్నకొద్దిమంది కిందపడిపోయారు. వెనక ఉన్నవారు ముందుకు పరిగేత్తే క్రమంలో తొక్కిసలాట జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం అయింది. అక్కడున్నవాళ్లు స్పందించడంతో ఏ ప్రమాదం చోటుచేసుకోలేదు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాల్గొన్నవారు  మాస్కు ధరించడం వంటి కనీస నిబంధనను కూడా పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన బరేలీ మేయర్, కాంగ్రెస్ నేత సుప్రియా అరోన్ తాజాగా ఘటనపై స్పందించారు. ‘వైష్ణోదేవీ ఆలయానికి వేల సంఖ్యలో వెళ్లారు. దాని సంగతేంటి? ఇది మానవీయతకు సంబంధించింది. వారంతా పాఠశాల విద్యార్థినులు. వారు ఏదో కొద్ది సమయం బయటకు రావాలనుకుంటారు. ఇది ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే కాంగ్రెస్ తరఫున నేను క్షమాణలు చెప్పాలనుకుంటున్నాను’ అని మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహిస్తోన్న ప్రచారాలకు భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారు. ఒకపక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తున్నా.. ఎక్కడా నిబంధనల జాడ కనిపించడం లేదు. కొవిడ్ నియమాలను అనుసరించి ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు కోరుకుంటున్నాయని చెప్పి, ఎన్నికల సంఘం పక్కకు తప్పుకుంది. ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. 

మరోపక్క వైద్య నిపుణులు మాస్కులు ధరించడం తప్పనిసరని చెప్తున్నారు. ‘వీలైతే ఎన్‌95 మాస్కులు ధరించండి. కుదిరితే వాటిని పంపిణీ చేయండి. డబుల్‌ మాస్క్‌కే అధిక ప్రాధాన్యం. ఇప్పుడు మన మధ్య కార్చిచ్చు కంటే వేగంగా వ్యాపించే వేరియంట్ ఉంది’ అని డాక్టర్ అరవిందర్ సింగ్ ట్వీట్ చేయగా.. కనీసం రాజకీయ నాయకులు మీ మాట వినగలిగితే చాలంటూ ఓ నెటిజన్ సమాధానం ఇచ్చారు. యూపీలో తాజాగా 570 మందికి కరోనా సోకింది. మొత్తంగా 17లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఎనిమిదికి చేరాయి. దానికి డెల్టా కంటే వేగంగా వ్యాపించే లక్షణముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఎన్నికల హోరులో ఆ మాటల్ని పట్టించుకునేవారే లేకుండా పోయారు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని