Varun Singh:  ప్రాణాలతో పోరాడుతున్న వరుణ్ సింగ్‌.. రెండు నెలల కిందటి లేఖ వైరల్‌..!

‘మీరు యావరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు అది కొలమానం కాదు. మీ లక్ష్యం ఏంటో గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ ఆశను మాత్రం వీడకండి’..

Published : 11 Dec 2021 01:26 IST

దిల్లీ: ‘మీరు యావరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు అది కొలమానం కాదు. మీ లక్ష్యం ఏంటో గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ ఆశను మాత్రం వీడకండి’.. జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మనసు నుంచి వచ్చిన స్ఫూర్తిదాయక పదాలివి. ఎంచుకున్న వృత్తిలో రాణించేవరకు ఆయన కూడా సాధారణ విద్యార్థే. చెప్పుకోదగ్గ మార్కులేం రాలేదట. ఇవే మాటలు చెప్తూ.. తాను చదివిన హరియాణాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్‌కు సెప్టెంబర్‌లో వరుణ్ లేఖ రాశారు. తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో హెలికాఫ్టర్ దుర్ఘటన సమయంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

‘నేను చదువులో చాలా సాధారణ విద్యార్థిని. 12వ తరగతిలో ఫస్ట్ డివిజన్ మాత్రమే పొందాను. చదువొక్కటే కాదు.. ఆటలు, ఇతర కార్యక్రమాల్లో కూడా అంత చురుగ్గా ఉండేవాడిని కాదు. కానీ, నాకు విమానాలు, విమాయానం గురించి తెలుసుకోవాలని మాత్రం ఆసక్తి ఉండేది. అయితే నేను సాధారణ వ్యక్తిని.. గొప్పగా చేయాలని ప్రయత్నించడంలో అర్థం లేదనే న్యూనతతో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఫ్లైట్ స్క్వాడ్రన్‌లో యంగ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యానో.. అప్పటి నుంచి నా ఆలోచన మారింది.  నేను మనస్సు పెట్టి పనిచేస్తే.. గొప్పగా పనిచేయగలనని అర్థమైంది. అంతే వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు మొదలయ్యాయి’ అంటూ వరుణ్ తన అనుభవాలను వివరించారు.

అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఛాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోఫీలను గెలుచుకున్నారు. కఠినమైన ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ కోర్సుకు ఎంపికయ్యారు. చివరకు, ఆయన సీనియారిటీ మార్కు దాటనప్పటికీ, తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్‌లో పోస్టింగ్ పొందారు. ఆయన విజయాలు అక్కడితో ఆగలేదు. ఇస్రో చరిత్రలో మేకింగ్ గగన్‌యాన్ ప్రొగ్రామ్ కోసం 12 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో కూడా చోటుదక్కించుకున్నారు. తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలతో తాను వెనకడుగు వేయాల్సి వచ్చిందని తన లేఖలో పేర్కొన్నారు. ‘జీవితంలో నువ్వు సాధించే విజయాలను 12వ తరగతిలో వచ్చే మార్కులు నిర్ణయిస్తాయని అనుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ము. ఆ దిశగా పని చేయి’ అంటూ తన లేఖను ముగించారు.

డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ దుర్ఘటనలో వరుణ్ సింగ్ మినహా మిగతా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో వరుణ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అధికారిక వర్గాల సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని