Published : 05 Jan 2022 23:45 IST

Israel: 4వ డోసుకు సిద్ధమైన ఇజ్రాయెల్‌.. వైరస్‌ ఉద్ధృతితో సతమతం!

కొవిడ్‌ను ఎదుర్కొనే సరైన వ్యూహం లేదనే విమర్శలు

జెరూసలేం: వేగంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్న దేశాల్లో ముందు వరుసలో ఉన్న ఇజ్రాయెల్‌.. ఇప్పటికే మూడో డోసు పంపిణీని సగం పూర్తిచేసింది. ఇదే సమయంలో వైరస్‌ తీవ్రత తగ్గుతోందని భావించిన అక్కడి ప్రభుత్వం.. రెండేళ్ల తర్వాత విదేశీ పర్యాటకులకు అనుమతి ఇస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. కానీ, కొవిడ్‌ ఉద్ధృతి మళ్లీ పెరగడంతో నెల తిరిగేసరికి మరోసారి ఆంక్షల బాట పట్టింది. ముఖ్యంగా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న అమెరికా, యూరప్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టినప్పటికీ వైరస్‌ నియంత్రణలోకి రాకపోవడంతో అక్కడి ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. వైరస్‌ను ఎదుర్కొనే సరైన వ్యూహం ప్రభుత్వానికి లేనందునే ఒమిక్రాన్‌ రూపంలో మరో వేవ్‌ను చవిచూడాల్సి వస్తోందనే ఆందోళన కొందరి ఇజ్రాయెల్‌ ప్రజల్లో నెలకొంది.

రికార్డు స్థాయిలో కేసులు..

గత కొన్నిరోజులుగా ఇజ్రాయెల్‌లో కొవిడ్‌ విజృంభణ మళ్లీ మొదలయ్యింది. వారం రోజుల క్రితం రోజువారీ కేసులు 3వేలు ఉండగా.. ప్రస్తుతం అది 10వేలు దాటింది. సోమవారం 10,815 కేసులు నమోదు కాగా, మంగళవారం 11వేలకు చేరింది. బుధవారం ఒక్కరోజు రికార్డు స్థాయిలో దాదాపు 12 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న సమయంలో (సెప్టెంబర్‌ 2న) అక్కడ గరిష్ఠంగా రికార్డయిన 11,345 కేసుల సంఖ్యను తాజాగా అధిగమించింది. దీంతో ఒమిక్రాన్‌ కారణంగా కొత్త వేవ్‌ ప్రారంభమైనట్లు స్పష్టమవుతోందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టెస్టుల కొరత కారణంగా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అయితే, కొవిడ్‌ మరణాలు మాత్రం తక్కువగానే ఉండడం ఊరట కలిగించే విషయమని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు.

నియంత్రణ కష్టమే..!

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒమిక్రాన్‌ వేవ్‌ నియంత్రణలోకి వచ్చేలా కనిపించడం లేదని అక్కడి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి శరోన్‌ ఆల్‌రోయ్‌ పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఎవ్వరికీ రక్షణ లేదని జెరూసలేంలోని షారే జెడెక్‌ మెడికల్‌ సెంటర్‌ అధ్యక్షుడు జొనాథన్‌ హల్వీ వెల్లడించారు. అంతేకాకుండా రానున్న వారాల్లో రోజువారీ ఇన్‌ఫెక్షన్‌లు రికార్డు స్థాయిలో నమెదవుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించకుండా ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రస్తుతం తమముందున్న కొత్త లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే బూస్టర్‌ డోసును అందిస్తున్నామన్న ఆయన.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారితోపాటు 60ఏళ్ల వయసు పైబడిన వారికి నాలుగో డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

నాలుగో డోసుకు సిద్ధం..

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తొలిరోజుల్లో ఇతర దేశాలతో పోలిస్తే టీకా పంపిణీలో ఇజ్రాయెల్‌ నెం.1గా నిలిచింది. కానీ కొన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో ప్రస్తుతం 17వ స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ జనాభాలో 65శాతం మందికి మాత్రమే రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందించగలిగారు. దాదాపు 46శాతం మందికి మూడో డోసు కూడా పంపిణీ చేశారు. ఇదే సమయంలో కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు గానూ నాలుగో డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను ఈ నాలుగోడోసు ఐదురెట్లు పెంచుతున్నట్లు అధ్యయనంలో తేలిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఇది ప్రారంభమైతే.. ప్రపంచంలో నాలుగో డోసు (రెండో బూస్టర్‌ డోసు) ఇచ్చిన తొలి దేశంగా ఇజ్రాయెల్‌ నిలుస్తుంది.

అయితే, వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా చేపడుతున్నప్పటికీ కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఒ కచ్చితమైన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదనే విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో తాను తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రధాని బెన్నెట్‌ సఫలీకృతం కావడం లేదనే వాదనలూ ఉన్నాయి. ఇలాంటి విమర్శలపై ప్రధాని బెన్నెట్‌ స్పందించారు. ఇతర దేశాలు ఎంచుకున్న లాక్‌డౌన్‌ వంటి వ్యూహాన్ని మనం కూడా ఎంచుకోవచ్చని.. కానీ, అది అపార నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం బాధ్యతగా ఉంటామని.. కొవిడ్‌ కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ముందుకే వెళ్తామని ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ స్పష్టం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్