
Blue Origin: రోదసిలోకి వెళ్లి వచ్చిన అమెజాన్ అధినేత
టెక్సాస్: అంతరిక్షయానంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో కూడిన ‘న్యూ షెపర్డ్’ ప్రయోగం విజయవంతమైంది. నలుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేత స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ఈ యాత్రను చేపట్టింది. ఇందులో భాగంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగించారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైన కొద్దిరోజులకే అమెజాన్ అధినేత స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం కూడా విజయవంతమవడం విశేషం.
అంతరిక్ష ప్రయాణం సాగిందిలా..
* పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) న్యూ షెపర్డ్ ప్రయోగం ప్రారంభమైంది.
* బ్లూ ఆరిజిన్‌కి చెందిన ‘న్యూ షెపర్డ్’ అంతరిక్షంలోకి దూసుకెళ్లే సమయంలో గంటకు 3700 కిలోమీటర్లు వేగాన్ని రాకెట్ అందుకుంది. నౌక బయలుదేరిన రెండు నిమిషాలకు వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యారు. అనంతరం వ్యోమగాములు సీటు బెల్టులను తొలగించి భార రహితస్థితిని ఆస్వాదించారు.
* వ్యోమనౌక ప్రయాణం ప్రారంభమైన ఆరు నిమిషాలకు క్యాప్స్యూల్ నుంచి విడిపోయిన బూస్టర్ రాకెట్ తిరిగి భూ వాతావరణంలోకి పునః ప్రవేశించింది. ప్రయోగ వేదికకు 3.2కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్ ప్యాడ్‌కు చేరుకుంది.
* క్యాప్స్యూల్ మాత్రం సముద్రమట్టానికి 100కిలోమీటర్ల ఎగువన ఉన్న కార్‌మాన్ రేఖ వరకూ ప్రయాణించింది. ఆ సమయంలో వ్యోమగాములు కొద్దిసేపు భారరరహిత స్థితిని పొందారు. అనంతరం వ్యోమనౌక పారాచూట్ల సహాయంతో తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో గంటకు 16కిలోమీటర్ల స్థాయికి వేగాన్ని తగ్గించుకుంటూ కిందకు దిగింది.
* దాదాపు 15నిమిషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొన్న నలుగురు వ్యోమగాములు విజయసంకేతం చూపుతూ క్యాప్స్యూల్ నుంచి బయటకు వచ్చారు.
* ఈ యాత్రలో అమెజాన్ అధినేత బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్ కూడా ఉన్నారు. వీరితో పాటు మహిళా పైలట్ వేలీ ఫంక్ (82), ఆలివర్ డేమన్ (18) ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా వేలీ ఫంక్, అతిచిన్న వ్యోమగామిగా ఆలివర్ డేమన్ రికార్డు సృష్టించారు.
* ఈ యాత్ర కోసం తొలుత వేలంలో 2.8 కోట్ల డాలర్లు పెట్టి టికెట్ కొన్న ఓ వ్యక్తి మాత్రం అనివార్య కారణాలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.
ఏమిటీ బ్లూ ఆరిజిన్?
రోదసిలో తేలియాడే అంతరిక్ష కాలనీలను నిర్మించే లక్ష్యంతో 2000లో బ్లూ ఆరిజిన్‌ను బెజోస్ స్థాపించారు. అక్కడ కృత్రిమ గురుత్వాకర్షణ స్థితిని కల్పించి, లక్షల మంది పని చేసుకుంటూ, జీవించగలిగేందుకు అనువైన పరిస్థితులను సృష్టించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లూ ఆరిజిన్ ప్రస్తుతం ‘న్యూ గ్లెన్’ అనే భారీ రాకెట్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. చంద్రుడిపై దిగే ల్యాండర్‌నూ తయారుచేసి, అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ చేపట్టే ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.