Kim Jong Un Mystery: కిమ్‌ తలకు మిస్టరీ మరకలు..!

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తలకు గాయమైనట్లు కనిపిస్తోన్న ఫోటోలు ఆయన ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారితీశాయి.

Published : 04 Aug 2021 01:43 IST

ఉత్తర కొరియా అధినేత ఆరోగ్యంపై మరోసారి చర్చ

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై గత కొంతకాలంగా అంతర్జాతీయంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు బాహ్యప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ఆయన బయటకు కనిపించినప్పటికీ.. బరువు తగ్గినట్లు కనిపించడంపైనా తీవ్ర చర్చ జరిగింది. ఆయన బరువు తగ్గడంతో ఏకంగా దేశ ప్రజలే ఆందోళనకు గురయ్యి తీవ్ర బెంగపడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన తల వెనకభాగంలో గాయమైనట్లు కనిపిస్తోన్న ఫోటోలు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై మరోసారి చర్చినీయాంశమయ్యింది.

బాహ్య ప్రపంచానికి అరుదుగా కనిపించే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, జులై 24-27 మధ్య జరిగిన మిలటరీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాజీ సైనిక సిబ్బందితోనూ భేటీ అయ్యారు. ఆ సమయంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తల (మెడ పైభాగం)లో ఓ బ్యాండేజ్‌ ఉన్నట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసిన ఫోటోలు, వీడియోల్లో కనిపించింది. మరో నాలుగు రోజుల తర్వాత విడుదలైన ఫుటేజిల్లో మాత్రం ఆ ప్రదేశంలో ముదురు ఆకుపచ్చ రంగులో ఓ మచ్చ ఉన్నట్లు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అంతకుముందు అనగా.. జూన్‌ నెలలో జరిగిన కార్యక్రమాల్లో కిమ్‌ పాల్గొన్నప్పటికీ.. అప్పుడు అలాంటి మచ్చలు ఏవీ కనిపించలేదని ఉత్తరకొరియా వ్యవహారాలపై దృష్టి పెట్టే ఎన్‌కే న్యూస్‌ వెల్లడించింది. అంతేకాకుండా జులై 11న జరిగిన ఓ సంగీత కార్యక్రమంలోనూ కిమ్‌ తలకు గాయాలు, బ్యాండేజీ వంటి గుర్తులు లేవని పేర్కొంది. తాజాగా ఉ.కొరియా అధికారిక మీడియా కేసీటీవీ విడుదల చేసిన ఫోటోల్లో ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకలు స్పష్టంగా కనిపించాయని తెలిపింది. దీంతో ఆయనకు ఏదైనా శస్త్రచికిత్స జరిగిందా లేదా గాయం అయ్యిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇదిలాఉంటే, గతేడాది కొన్ని నెలలపాటు కిమ్‌ జోంగ్ ఉన్‌ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఒకానొక సమయంలో ఆయన మృతి చెందారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తర్వాత వివిధ కార్యక్రమాల్లో కిమ్‌ పాల్గొన్న ఫోటోలను అక్కడి అధికారిక మీడియా విడుదల చేయడంతో అలాంటి వార్తలకు ముగింపు పలికారు. ఇదిలాఉండగా ఈ మధ్యే జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి సంబంధించిన ఫోటోల్లో కిమ్‌ చాలా బరువు తగ్గినట్లు కనిపించారు. ఆయన కావాలనే బరువు తగ్గారా? లేదా అనారోగ్య కారణాల వల్ల సన్నబడిపోయారా? అన్న విషయంపై స్పష్టత లేదు. భారీకాయుడైన కిమ్‌ 140 కిలోలు ఉండేవారని, ఇప్పుడు దాదాపు 20 కిలోల వరకూ తగ్గారని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. ఆయన ముఖం చిన్నగా కనిపిస్తోందని, తను నిత్యం ధరించే ఖరీదైన చేతి గడియారం పట్టీని బిగించి కట్టినట్లు ఫొటోల ద్వారా తెలుస్తోందని అన్నారు. ఇలా ఆయన ఆరోగ్యంపై రకరకాల చర్చలు, అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో తాజాగా కిమ్‌ తలకు బ్యాండేజీ గుర్తులు, మరకలు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని