Gita Gopinath: వచ్చే నెలలో ఒమిక్రాన్ విజృంభించవచ్చు..!

ప్రపంచ దేశాలను ఇప్పుడు ఒమిక్రాన్ కలవరం పట్టుకుంది. ప్రపంచంపై ఈ కొత్త వేరియంట్ ప్రభావం గురించి ఐఎంఎఫ్ నిశితంగా పరిశీలిస్తోందని ఆ సంస్థ ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపీనాథ్ మీడియాకు వెల్లడించారు.

Updated : 17 Dec 2021 15:05 IST

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్ కలవరం పట్టుకుంది. ప్రపంచంపై ఈ కొత్త వేరియంట్ ప్రభావం గురించి ఐఎంఎఫ్ నిశితంగా అధ్యయనం చేస్తోందని ఆ సంస్థ ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపీనాథ్ మీడియాకు వెల్లడించారు. అయితే అది ఏస్థాయిలో ఉంటుందనే దానిపై తుది అంచనాకు రాలేదని వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్‌ వచ్చే నెలలో ఎక్కువయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

‘డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కుగానే ఉన్నప్పటికీ.. వచ్చే నెలలో కొత్త వేరియంట్ పెరిగే అవకాశం ఉందన్నారు. దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణముందని నివేదికలను బట్టి తెలుస్తోంది. అందుకు తగ్గట్టే వేగంగా ప్రబలితే.. ప్రయాణాలపై ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు సృష్టించవచ్చు. అందుకే ప్రపంచం మొత్తం టీకాలు పొందాల్సి ఉంది. లేకపోతే ఇలా కొత్త వేరియంట్లతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది’ అని గీత సూచించారు. టీకాలు తీసుకుంటే ఒమిక్రాన్‌ నుంచి కూడా కొంత రక్షణ లభిస్తుందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టీకా అసమానతలు తీవ్ర విషాదకరమని గీత ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక ఆదాయ దేశాలు తమ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేయగా.. అల్పాదాయ దేశాల్లో 4 శాతం మందికి మాత్రమే టీకాలు అందాయి. ఈ ఏడాది చివరినాటికి అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. 80 దేశాలు ఆ లక్ష్యాన్ని చేరుకోలేవు. టీకా డోసుల కొరతే అందుకు కారణం’ అని  అన్నారు. కొత్త వేరియంట్ల వేళ.. టీకాలు, వైద్య సామాగ్రిపై ఆంక్షలు విధించవద్దని సంపన్న దేశాలకు సూచించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని