Ram Nath Kovind: బంగ్లాదేశ్‌లో చారిత్రక కాళీ మందిరాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రపతి

1971 లిబరేషన్ వార్‌లో ధ్వంసమైన బంగ్లాదేశ్​లోని చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని పునఃనిర్మించగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ శుక్రవారం ప్రారంభించారు......

Published : 17 Dec 2021 18:40 IST

ఢాకా: బంగ్లాదేశ్​లో పునర్నిర్మించిన చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ శుక్రవారం ప్రారంభించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి.. చివరిరోజైన మూడో రోజు రాజధాని ఢాకాలోని ఈ చారిత్రక ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన సతీమణి సవితా కోవింద్​తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌-బంగ్లాదేశ్ ప్రజల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధానికి చిహ్నంగా ఈ ఆలయం నిలుస్తుందని అభివర్ణించారు. భారత్‌ సాయంతో ఈ ఆలయాన్ని పునఃనిర్మించడం ఆనందంగా ఉందన్నారు.

1971 లిబరేషన్ వార్‌లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన అనంతరం ప్రతి ఏటా బంగ్లాలో ‘విజయ్‌ దివస్‌’ను నిర్వహిస్తారు. స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదికి 50 ఏళ్లు కావడంతో దేశవ్యాప్తంగా ‘గోల్డెన్‌ జూబ్లీ’ సంబురాలు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకల్లో పాల్గొనాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్  నుంచి భారత్‌కు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు మూడు రోజులుగా రాష్ట్రపతి బంగ్లాలో పర్యటిస్తున్నారు.

హిందూ ఆలయాలే లక్ష్యంగా 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్​ బలగాలు శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని ధ్వంసం చేశాయి. ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ పేరుతో పాకిస్థానీ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో గుడిని పూర్తిగా ధ్వంసం చేసి,  నిప్పంటించాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తులతోపాటు అక్కడ ఆశ్రయం పొందిన దాదాపు వెయ్యి మంది మృతిచెందారు. ప్రస్తుతం ఈ ఆలయ పునఃనిర్మాణాకి భారత్‌ చేయూతనందించింది. ముస్లిం మెజారిటీ బంగ్లాదేశ్‌లో 16.9 కోట్ల జనాభా ఉండగా.. అందులో హిందువులు దాదాపు 10 శాతం ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని