Rahul Gandhi: మన ఫోన్లలోకి మోదీజీ ఆయుధాన్ని పంపారు..!

తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే పెగాసస్‌ స్పైవేర్‌ను మన ఫోన్లలోకి జొప్పించిన కేంద్రం.. ఇప్పుడు ఆ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని

Updated : 28 Jul 2021 15:06 IST

‘పెగాసస్‌’పై కేంద్రం సమాధానం చెప్పి తీరాలి: రాహుల్‌ గాంధీ 

దిల్లీ: ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే పెగాసస్‌ స్పైవేర్‌ను మన ఫోన్లలోకి జొప్పించిన కేంద్రం.. ఇప్పుడు ఆ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై నేడు రాహుల్‌ నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంపై ఘాటు విమర్శలు గుప్పించారు. హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. 

‘‘పెగాసస్‌ స్పైవేర్‌ను ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడాలి. కానీ నరేంద్ర మోదీజీ ఈ ఆయుధాన్ని మన ఫోన్లలోకి పంపించారు. నా ఫోన్‌తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అనేక మంది ప్రముఖ రాజకీయ నేతలు, మీడియా వ్యక్తుల ఫోన్లను హ్యాక్‌ చేశారు. మేం ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే.. పెగాసస్‌ను కొనుగోలు చేశారా?.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉపయోగించారా? పెగాసస్‌.. నా వ్యక్తిగత అంశం కాదు.. దేశ భద్రతకు సంబంధించిన విషయం. దీనిపై కేంద్రం జవాబు చెప్పి తీరాలి. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వడం లేదని కేంద్రం చెబుతోంది. కానీ మేం పార్లమెంట్‌ను అడ్డుకోవడం లేదు. కేవలం మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన ఈ ఆయుధం(పెగాసస్‌)పై చర్చ జరగాల్సిందే’’ అని పేర్కొన్నారు. 

అనంతరం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. దేశ భద్రత, సాగు చట్టాలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్‌ను నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ పెగాసస్‌పై చర్చ చేపట్టకుండా కేంద్రం తప్పుకుంటోంది’’ విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని