
Winter Session: ఆ మరణాలపై సమాచారం లేనప్పుడు.. సహాయం ప్రసక్తే లేదు
దిల్లీ: గత ఏడాది కాలంలో వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా సంభవించిన రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రైతుల మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుబాలకు ఆర్థిక సహాయం, వారిపై నమోదైన కేసులు వంటి విషయాలపై విపక్షాలు ప్రశ్నించాయి. దానిపై తోమర్ స్పందిస్తూ..‘ఆ అంశాలపై ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదు. అలాంటప్పుడు సహాయం అనే దానికి తావే లేదు’ అని తోమర్ స్పష్టం చేశారు.
విపక్షాలు, రైతు సంఘాల నేతలు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఏడాది కాలంగా దిల్లీ, ఆ సరిహద్దు ప్రాంతాల్లో జరుపుతోన్న నిరసనల వల్ల 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఉభయ సభల్లో సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం లభించింది. అయినా సరే రైతన్నలు వెనక్కి తగ్గలేదు. కనీన మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పలు అంశాలపై విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. దాంతో మధ్యాహ్నం 12 వరకు రెండు సభలు వాయిదా పడ్డాయి.