Pegasus: అతనేం చదువుతున్నాడో మాకు తెలుసు!

‘అతను ఏం చదువుతున్నాడో మాకు తెలుసు, మీ ఫోన్లో ఉన్న ప్రతీది’ అంటూ పెగాసస్‌ హ్యాష్‌ట్యాగ్‌ జతచేస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్‌ చేశారు.

Published : 19 Jul 2021 21:37 IST

హ్యాకింగ్‌ వ్యవహారంపై రాహుల్‌ గాంధీ విమర్శ

దిల్లీ: ‘పెగాసస్‌’ స్పైవేర్‌ సహాయంతో దేశంలో వందల మంది ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెలువడిన కథనాలు సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చ జరపాల్సిందేనని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా స్పందించారు. ‘అతను ఏం చదువుతున్నాడో మాకు తెలుసు, మీ ఫోన్లో ఉన్న ప్రతీది’ అంటూ పెగాసస్‌ హ్యాష్‌ట్యాగ్‌ జతచేస్తూ ట్విట్‌ చేశారు. హ్యాకింగ్‌పై విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రం సంధించారు.

చర్చకు విపక్షాల పట్టు..

పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతోన్న వేళ.. పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడికావడం మరోసారి రాజకీయ వేడికి కారణమయ్యింది. తాజాగా లీక్‌ అయిన ఓ డేటాబేస్‌లో దాదాపు 300మంది ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు తెలుస్తుండడంతో అందరిలోనూ ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా ఇవన్నీ 2019 లోక్‌సభ ఎన్నికల ముందే జరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది. దీనిపై చర్చ జరపాలని విపక్షపార్టీలు పట్టుబడుతున్నాయి. ఇలాంటి పరిణామాలతో జాతీయ భద్రతకు ముప్పు పొంచివుందన్న కాంగ్రెస్‌, పెగాసస్‌ అంశంపై చర్చించాల్సిందేనని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌధురి డిమాండ్‌ చేశారు.

తోసిపుచ్చిన కేంద్రం..

ఇదిలాఉంటే, ఇజ్రాయెల్‌లోని NSO గ్రూప్‌ కంపెనీకి చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ వాస్తవానికి ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటుంది. నిఘా కార్యకలాపాల కోసం దాన్ని ప్రభుత్వ సంస్థలకు NSO గ్రూప్‌ విక్రయిస్తుంటుంది. దీంతో తాజా హ్యాకింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే- ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. హ్యాకింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని