WHO chief in Afghan: అఫ్గాన్‌ పర్యటనలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌!

అఫ్గాన్‌ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అత్యంత ప్రధానాంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ గెబ్రెయేసస్‌ అఫ్గాన్‌ పర్యటన చేపట్టారు.

Published : 20 Sep 2021 22:07 IST

తాలిబన్‌ ప్రతినిధులతో భేటీ కానున్న టెడ్రోస్‌

కాబుల్‌: అమెరికా బలగాల ఉపసంహరణ, తాలిబన్ల హస్తగతం తర్వాత అఫ్గానిస్థాన్‌ తీవ్ర సంక్షోభంలోకి జారుకున్న విషయం తెలిసిందే. తాజాగా నెలకొన్న పరిస్థితులు అఫ్గాన్‌ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా నిధులు, నిర్వహణ లేమితో వందల సంఖ్యలో వైద్య, ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా మూతపడుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అత్యంత ప్రధానాంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ గెబ్రెయేసస్‌ అఫ్గాన్‌ పర్యటన చేపట్టారు. అక్కడ వైద్య, ఆరోగ్య సేవలను పర్యవేక్షించడంతో పాటు తాలిబన్‌ నాయకత్వంతోనూ సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌ ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా సోమవారం కాబుల్‌ చేరుకున్న టెడ్రోస్‌.. ఆరోగ్య సంరక్షణ సేవలను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా తాలిబన్ల ప్రతినిధులతోనూ భేటీ అవుతానన్నారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో ఆరోగ్య విభాగానికి ప్రపంచ బ్యాంకు అందించే నిధులను నిలిపివేయడంపై ఆయా అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి ఆ నిధులను విడుదల చేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు అఫ్గాన్‌ ఆరోగ్య మంత్రిగా ఉన్న వాహిద్‌ మజ్రూహ్‌ పేర్కొన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాకుండా అఫ్గాన్‌ ప్రధానమంత్రి ముల్లా హసన్‌ అఖుంద్‌, ఉప ప్రధాని ముల్లా బరాదర్‌లతోనూ డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ అవుతారని వెల్లడించారు.

అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయింది. దేశవ్యాప్తంగా 2300 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ వారం రోజుల్లోనే 90శాతం మూతపడే ప్రమాదం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ ప్రతినిధి రిక్‌ బ్రెన్నన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీటిలో దాదాపు 500 కేంద్రాలకు వైద్య పరికరాలు, ఔషధాల సరఫరాతో పాటు నిధులను కూడా అందించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ కృషి చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ అఫ్గాన్‌ పర్యటన చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని