IMA: ‘భారత్‌లో లాక్‌డౌన్‌ పరిస్థితి రాదు!’

భారత్‌లో అర్హులైనవారిలో 95 శాతం మందికి ఇప్పటికే కొవిడ్‌ టీకా పూర్తయిన నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ వంటి పరిస్థితి రాదని ఐఎంఏకు చెందిన డా.అనిల్‌ గోయల్‌ తెలిపారు. చైనా ప్రజలకంటే భారతీయుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని చెప్పారు.

Published : 22 Dec 2022 16:35 IST

దిల్లీ: చైనా(China), జపాన్‌, అమెరికా సహా పలు దేశాల్లో కొవిడ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. భారత్‌ సైతం అప్రమత్తమైన విషయం తెలిసిందే. అయితే, అధిక వ్యాప్తి సామర్థ్యంగల ఒమిక్రాన్‌ ఉపరకం బీఎఫ్‌.7(BF.7 ) కేసులు భారత్‌లోనూ వెలుగు చూసిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు మరో వేవ్‌కు దారితీసి, దేశాన్ని మళ్లీ లాక్‌డౌన్‌లోకి నెడతాయా? అన్న కలవరం నెలకొంది! ఈ తరుణంలో భారత వైద్య సంఘాని(IMA)కి చెందిన డా.అనిల్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే దేశ జనాభాలో అర్హులైనవారిలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన నేపథ్యంలో.. లాక్‌డౌన్‌(Lockdown) వంటి పరిస్థితి రాదని ఆయన ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో చెప్పారు. భారతీయుల రోగనిరోధక శక్తి చైనీయుల కంటే అధికంగా ఉందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో.. భారత్‌ తప్పనిసరిగా మళ్లీ ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్‌’ విధానానికి మారాలని డా.గోయల్ ఈ సందర్భంగా సూచించారు. ‘ఇప్పటికే భారత్‌ 200 కోట్లకుపైగా డోసులు అందించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వంటి పరిస్థితి తలెత్తదు’ అని చెప్పారు. మరోవైపు.. పౌరులంతా తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలతో వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ఇప్పటికే ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని