ప్రభుత్వ కుట్రకు కిసాన్‌ పరేడ్‌ బలి: రైతు నేతలు

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ చేపట్టిన కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ ప్రభుత్వ కుట్రకు బలైందని రైతు నేతలు ఆరోపించారు. తమ ట్రాక్టర్‌ పరేడ్‌ను ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలని చూసినా 99.9 శాతం మంది రైతులు శాంతియుతంగానే........

Published : 27 Jan 2021 21:47 IST

దిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ చేపట్టిన కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ కేంద్ర ప్రభుత్వ కుట్రకు బలైందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. తమ ట్రాక్టర్‌ పరేడ్‌ను ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలని చూసినా 99.9 శాతం మంది రైతులు శాంతియుతంగానే ర్యాలీలో పాల్గొన్నారని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. తమతో సంబంధం లేని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీని ముందు పెట్టి ఉద్రిక్తతలు జరిగేలా చూశారని ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎర్రకోట మార్గంలో చేపట్టిన పరేడ్‌తో తమకు సంబంధం లేదని స్పష్టంచేశారు. కొందరు కుట్రపూరితంగా రైతుల కవాతును విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినా శాంతియుతంగా రైతుల ఆందోళన కొనసాగుతుందని, చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతు నేతలు స్పష్టంచేశారు.

రైతు నేతలపై కేసులు
కిసాన్ పరేడ్‌ సందర్భంగా  చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు రైతు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాకేశ్‌ తికాయత్‌, దర్శన్‌పాల్‌, యేగేంద్ర యాదవ్‌ సహా మొత్తం 37 మంది నేతలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మొత్తం 22 ఎఫ్‌ఐఆర్‌ల్లో వీరి పేర్లు చేర్చారు. ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి వీరి పాత్రపై విచారణ జరపనున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం జరిగిన ఘటనల్లో 300 మంది పోలీసులు గాయపడ్డారు. హింసకు పాల్పడిన 200 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హత్యాయత్నం, విధులకు భంగం కలిగించడం వంటి అభియోగాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

ఇవీ చదవండి..
దిల్లీ అల్లర్లు.. ‘దీప్‌ సిద్ధూ’ పాత్రేంటీ?
సిద్ధూతో నాకు సంబంధం లేదు: సన్నీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని