Afghan Crisis: తాలిబన్లకు అమెరికా షాక్‌!

తాలిబన్లకు అమెరికా షాక్‌ ఇచ్చింది. తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న అఫ్గానిస్థాన్‌ నిధులపై ఆంక్షలు విధించినట్టు సమాచారం. ....

Published : 18 Aug 2021 21:47 IST

అఫ్గాన్‌ నిధులపై ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం

వాషింగ్టన్‌: తాలిబన్లకు అమెరికా షాక్‌ ఇచ్చింది. తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న అఫ్గానిస్థాన్‌ నిధులపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించినట్టు సమాచారం. దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంకులో ఉన్న డబ్బు తాలిబన్ల నేతృత్వంలోని ప్రభుత్వం యాక్సిస్‌ చేయకుండా స్తంభింపజేసినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికాలో ఏ సెంట్రల్‌ బ్యాంకులో ఉన్న ఆస్తులూ తాలిబన్లకు అందుబాటులో ఉంచకుండా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. అఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ద ఆఫ్గన్‌ బ్యాంక్‌)కు న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు, అమెరికాలోని ఆర్థిక సంస్థల్లో దాదాపు 9.5బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. 

తాలిబన్లు కాబుల్‌ నగరాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే అమెరికా బ్యాంకుల్లోని అఫ్గాన్‌ ప్రభుత్వ నిధులను స్తంభింపజేసినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనంలో పేర్కొంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జనెత్‌ యెల్లెన్‌, ఆ కార్యాలయంలోని విదేశీ ఆస్తుల నియంత్రణ సిబ్బంది అఫ్గాన్‌ ప్రభుత్వ ఖాతాలను స్తంభింపజేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తాలిబన్‌ ప్రభుత్వం డబ్బును యాక్సిస్‌ చేయకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా అమెరికా నుంచి కాబుల్‌కు నగదు రవాణాను కూడా నిలిచిపోయినట్టు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. మరోవైపు, అఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంకు  తాత్కాలిక చీఫ్‌ అజ్మల్‌ అహ్మదీ కూడా గత శుక్రవారమే ఈ అంశంపై ట్వీట్‌ చేశారు. తాలిబన్లు డబ్బును యాక్సిస్‌ చేయకుండా డాలర్ల సరఫరా నిలిపివేయబడుతుందని ట్విటర్‌లో పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని