Updated : 02 Nov 2021 15:29 IST

China Vs Taiwan: తైవాన్‌ను డ్రాగన్‌ ముట్టకుండా తెరపైకి ‘పాయిజన్‌ ఫ్రాగ్‌’ 

 

 ఆ దేశ ద్వీపాలను రక్షించడానికి అమెరికా వ్యూహ సంస్థల కసరత్తు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చిక్కటి అడవుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే విషపూరిత కప్పను ఏ పాము అయినా నోట పట్టిందా.. ఆ రోజుతో పాముకు భూమిపై నూకలు చెల్లిపోతాయి. అచ్చం ఇలానే తైవాన్‌ను అత్యంత దుర్భేద్యంగా మార్చేయాలని అమెరికా వ్యూహ రచన చేస్తోంది. ఇటీవల జో బైడెన్‌ మాట్లాడుతూ తైవాన్‌ రక్షణకు తాము జోక్యం చేసుకొంటామని నోరుజారారు. వాస్తవానికి అమెరికా పాలసీకి ఇది విరుద్ధం. అమెరికా వైఖరి బహిర్గతమైతే చైనా అప్రమత్తమై మరిన్ని జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంది. అప్పుడు తైవాన్‌ను రక్షించడం మరింత కష్టమైపోతుంది. అందుకే వెంటనే శ్వేతసౌధం ప్రతినిధి  జెన్‌సాకి మళ్లీ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ‘వన్‌ చైనా పాలసీ’కి కట్టుబడే విషయంలో తమ వైఖరి మారలేదని పేర్కొన్నారు. తైవాన్‌ రక్షణ విషయంలో అమెరికాకు అతితక్కువ అవకాశాలు ఉన్నట్లు ఇటీవల తేలింది. దీంతో  చైనా ఏ మాత్రం దుస్సాహసం చేసినా.. ఆ తర్వాత పరిణమాలను భరించలేక వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి తీసుకురావాలని అమెరికా వ్యూహకర్తలు చెబుతున్నారు. ఇందుకోసం వారు ‘ది పాయిజన్‌ ఫ్రాగ్‌’ వ్యూహం ఉత్తమమని సూచిస్తున్నారు.

డాంగ్‌షా ద్వీపంపై చైనా కన్ను

ఇటీవల తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చైనా యుద్ధవిమానాలు పదుల సంఖ్యలో చొరబడుతున్నాయి. చైనా తొలుత డాంగ్‌షా  ద్వీపం, ప్రాతాస్‌ ద్వీపాన్ని ఆక్రమించాలని కుయుక్తులు పన్నుతోంది. ఈ రెండు ద్వీపాలు తైవాన్‌లో భాగం. వీటిల్లో తొలిదాడి డాంగ్‌షాపై జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కేవలం 500 మంది తైవాన్‌ భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. చైనా అధీనంలోని హాంకాంగ్‌ నుంచి ఇది 190 మైళ్ల దూరంలో ఉండగా.. తైవాన్‌కు 275 మైళ్ల దూరంలో ఉంది. 

ఇటీవల చైనా ఒక దీవిని ఆక్రమించేందుకు వీలుగా సైనికులతో సాధన చేయిస్తున్న విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏ దాడి నుంచి అయినా తైవాన్‌ను రక్షించేందుకు వీలుగా సమీపంలో అమెరికాకు చెందిన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు తగినన్ని లేవు. తైవాన్‌ చిన్న దేశం కావడం.. పెద్ద దేశాల నుంచి దానికి గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో తైవాన్‌ రక్షణ అమెరికాకు కష్టం కానుంది. ఈ విషయం ఇటీవల వాషింగ్టన్‌లోని సీఎన్‌ఏస్‌ (సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికా సెక్యూరిటీ) సంస్థ ‘వార్‌గేమింగ్‌ ల్యాబ్‌’లో చేసిన  ప్రయోగాల్లో ఊహించని లోపాలు బయటపడ్డాయి.  తైవాన్‌ను రక్షించే క్రమంలో అమెరికాకు చాలా సమస్యలు తలెత్తనున్నట్లు తేలింది. తైవాన్‌-అమెరికా సైన్యాల మధ్య కమ్యూనికేషన్లు కూడా సక్రమంగా ఉండే అవకాశం లేదని తెలిసింది. అమెరికాకు చాలా పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నట్లు ఈ వార్‌గేమ్స్‌లో బయటపడింది.   

తెరపైకి కొత్త వ్యూహం..

డాంగ్‌షా ద్వీపంలో చదునైన భూభాగం ఉండటంతో ఆక్రమణల నుంచి రక్షించడం కష్టం. డాంగ్‌షా ద్వీపాన్ని ఆక్రమిస్తే  ప్రాదేశిక జలాలు, ఎక్స్‌క్ల్యూజివ్‌ ఎకనమిక్‌ జోన్లతో దక్షిణ చైనా సముద్రంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నావికాదళం పట్టు బిగుస్తుంది. తైవాన్‌ రక్షణకు వచ్చే దేశాల నౌకలను అడ్డుకోవడం తేలిగ్గా మారుతుంది. ఫలితంగా తైవాన్‌ ఆక్రమణ సులువు అవుతుంది. గతేడాది చైనా డ్రోన్లు తరచూ ఈ ద్వీపం వద్దకు రావడంతో.. వాటిని కూల్చేస్తామని తైవాన్‌ హెచ్చరికలు కూడా జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో డాంగ్‌షా, ప్రతాస్‌ వంటి చిన్న ద్వీపాలను వీలైనంత దుర్లభంగా మార్చేసి రక్షించాలని అమెరికా భావిస్తోంది. సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికా సెక్యూరిటీ వ్యూహాకర్తలు అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్‌ మింగటానికి వీలుకాని ‘విషపూరిత కప్ప’వలే తైవాన్‌ ద్వీపాలను మార్చాలని సూచించారు. ఇప్పటికే అమెరికా సైనికులు రహస్యంగా తైవాన్‌లో భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యూహానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు సైనికపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైనా భరించలేనంత మూల్యం చెల్లించేలా సిద్ధం చేయాలని వ్యూహకర్తలు సూచించారు. వీటిల్లో చైనాపై ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించడం వంటివి కూడా ఉన్నాయి. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని