Published : 23 Feb 2022 19:01 IST

UP Polls: యూపీలో ముగిసిన నాలుగో విడత పోలింగ్‌

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ రసవత్తర పోరులో బుధవారం నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఉదయం 7గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటల వరకు 57.45శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పిల్భిత్‌, లఖింపుర్‌ ఖేరీ, సీతాపూర్‌, హర్డోయి, ఉన్నావ్‌, లఖ్‌నవూ, రాయ్‌బరేలీ, బాందా, ఫతేపూర్‌ జిల్లాల పరిధిలోని 59 నియోజకవర్గాల్లో 624మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వారి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ స్థానాల్లో మొత్తంగా 2.3 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా.. వీరిలో 1.14 కోట్ల మంది పురుషులు కాగా, 99.3లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నాలుగో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం  13,817 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

లఖ్‌నవూలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, మంత్రి బ్రిజేశ్ పాఠక్‌, పలువురు సీనియర్‌ అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొన్ని చోట్ల ఉదయపు నడకకు వచ్చిన వారు తమ పోలింగ్‌ స్లిప్పులను వెంటతీసుకొచ్చి ఓటేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 స్థానాలకు గాను భాజపాకు 51 స్థానాల్లో విజయ దుందుభి మోగించగా.. సమాజ్‌ వాదీ పార్టీ నాలుగు, బీఎస్పీ మూడు చోట్ల గెలుపొందాయి. భాజపా మిత్రపక్షమైన అప్నాదళ్‌ ఒక చోట విజయం సాధించింది. ఇక్కడ 2017 ఎన్నికల్లో 62.55శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 60.03శాతం పోలింగ్‌ నమోదైంది. యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని