ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్‌ వాజేనే

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాహనంలో ఉన్న జిలటెన్‌ స్టిక్స్‌ను పోలీసు

Published : 31 Mar 2021 17:17 IST

ఎన్‌ఐఏ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి..

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాహనంలో ఉన్న జిలటెన్‌ స్టిక్స్‌ను పోలీసు అధికారి సచిన్‌ వాజేనే కొనుగోలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే ఆ పేలుడు పదార్థాలను వాజే ఎక్కడనుంచి కొనుగోలు చేశారన్నది మాత్రం చెప్పలేదు. 

ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపాన కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయి, సస్పెన్షన్‌కు గురైన వాజే.. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు. కాగా.. జిలటెన్‌ స్టిక్స్‌తో ఉన్న వాహనాన్ని అంబానీ ఇంటివద్ద నిలిపిన సమయంలో వాజే కూడా అక్కడే ఉన్నట్లు తమ వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ ఉందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, ఆ వాహనంలో పెట్టిన పేలుడు పదార్థాలను కొనుగోలు చేసింది కూడా వాజేనే అని తెలిపాయి. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా సేకరించనున్నట్లు చెప్పాయి. తద్వారా వాజే కదలికలను తెలుసుకోనున్నారు. 

వాహనం నిలిపింది వాజే డ్రైవర్‌..

మరోవైపు అంబానీ నివాసం సమీపంలో ఆ వాహనాన్ని పార్క్‌ చేసింది వాజే వ్యక్తిగత డ్రైవర్‌ అని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. డ్రైవర్‌ స్కార్పియోను తీసుకురాగా.. ఆ వెనుకే వాజే తెల్లరంగు ఇన్నోవా కారులో అనుసరించారని ఎన్‌ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఫిబ్రవరి 17న మన్‌సుఖ్‌ హిరేన్‌ స్కార్పియోను ములంద్‌ ఎరోలీ రోడ్డులో నిలిపాడు. అదే రోజు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చి కారు తాళాలను సచిన్‌ వాజేకు ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత వాజే వ్యక్తిగత డ్రైవర్‌.. ఆ స్కార్పియోను తీసుకొచ్చి సాకేత్‌ హౌసింగ్‌ సొసైటీలోని వాజే నివాసంలో పార్క్‌ చేశాడు. ఫిబ్రవరి 19న మళ్లీ డ్రైవర్‌ కారును పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో తీసుకెళ్లాడు. అదే రోజు తిరిగి వాజే నివాసానికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఫిబ్రవరి 24 రాత్రి వరకు స్కార్పియో పోలీసు అధికారి నివాసం వద్దే ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25 రాత్రి 10 గంటలకు డ్రైవర్‌ స్కార్పియోను తీసుకెళ్లి అంబానీ ఇంటి సమీపంలో పార్క్‌ చేశాడు. తర్వాత కారు దిగి వెనకాలే వాజే నడుపుతున్న ఇన్నోవాలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు’’ అని ఎన్‌ఐఏ వర్గాలు వివరించాయి. కొద్ది గంటల తర్వాత వాజే మళ్లీ ఇన్నోవా కారులో వచ్చి స్కార్పియోలో బెదిరింపు లేఖ పెట్టి వెళ్లినట్లు సదరు వర్గాలు తెలిపాయి. సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు కొన్ని సీసీటీవీ రికార్డులను ధ్వంసం చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని