Partha Chetarjee: ‘పేదల డబ్బు కొల్లగొట్టాడు’.. పార్థా ఛటర్జీపైకి చెప్పు విసిరిన మహిళ

పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోపంతో ఆయనపైకి చెప్పు విసిరారు. .......

Published : 03 Aug 2022 01:47 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోపంతో ఆయనపైకి చెప్పు విసిరారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను వైద్య పరీక్షల కోసం కోల్‌కతాలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకొచ్చిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పేరు సుభ్ర ఘాడైగా పేర్కొన్న మహిళ.. తనది దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అమ్టాలా ప్రాంతమని విలేకర్లతో చెప్పారు. అయితే, మాజీ మంత్రిపైకి చెప్పు ఎందుకు విసిరారంటూ మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా.. ‘‘ఎంతోమంది పేద ప్రజల డబ్బును కొల్లగొట్టిన విషయం మీకు తెలియదా? మరి నన్నెందుకు అడుగుతున్నారు? అలాంటి వ్యక్తిని ఏసీ కార్లలో తిప్పుతున్నారు. అతడి మెడకు తాడు కట్టేసి ఈడ్చుకెళ్లాలి. ఆ చెప్పు అతడి తలకు తగిలితే ఎంతో సంతోషించేదాన్ని. ఎంతోమంది ప్రజలకు తినడానికి తిండిలేదు.. పార్థా ఛటర్జీ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడేమో నగదు దాచుకోవడానికి ఫ్లాట్లు కొంటూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ కోపం నా ఒక్కదానిదే కాదు.. లక్షల మంది బెంగాల్‌ ప్రజలది’’ అని మహిళ చెప్పుకొచ్చారు. 

అయితే, మహిళ చెప్పు విసరడంతో పార్థా ఛటర్జీని చుట్టుముట్టిన సిబ్బంది ఆయన్ను సురక్షితంగా తరలించారు. చుట్టూ భారీ సంఖ్యలో సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్థా ఛటర్జీ, అతడి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఉన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. 2014-2021 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు.. పార్థాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అర్పిత నివాసాల్లో సోదాలు జరపగా.. రూ.50కోట్లకు పైగా కరెన్సీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, కీలక దస్త్రాలు లభ్యమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని