Oxfam Report: ‘డిజిటల్‌’లోనూ అసమానతలు! ఆక్స్‌ఫామ్‌ నివేదికలో వెల్లడి

కులం, మతం, లింగం, వర్గం, ప్రాంతం ఆధారంగా దేశంలో పెరిగిపోతోన్న అసమానతలు.. డిజిటల్‌ సాంకేతికతల లభ్యతలోనూ ఆందోళనకర స్థాయిలో కనిపిస్తున్నట్లు ‘ఆక్స్‌ఫామ్‌ ఇండియా’ తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారత అసమానతల నివేదిక 2022: డిజిటల్‌ విభజన‌’ పేరిట ఈ రిపోర్టును రూపొందించింది.

Published : 06 Dec 2022 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కులం, మతం, లింగం, వర్గం, ప్రాంతం ఆధారంగా దేశంలో పెరిగిపోతోన్న అసమానతలు.. డిజిటల్‌ సాంకేతికతల లభ్యతలోనూ ఆందోళనకర స్థాయిలో కనిపిస్తున్నట్లు ‘ఆక్స్‌ఫామ్‌ ఇండియా(Oxfam India)’ తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారత అసమానతల నివేదిక 2022: డిజిటల్‌ విభజన‌’ పేరిట రూపొందించిన ఈ రిపోర్టు ప్రకారం.. 2021లో దేశంలో ఫోన్‌లు ఉన్న పురుషుల శాతం 61 వరకు ఉండగా.. అదే మహిళల విషయంలో కేవలం 31 శాతంగానే ఉంది. దీంతోపాటు డిజిటల్‌ లభ్యత.. ఎక్కువగా పురుషులు, పట్టణ ప్రాంతవాసులు, ఉన్నత కులాలు, వర్గాలకే పరిమితమైనట్లు పేర్కొంది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) ఆధ్వర్యంలో 2018 జనవరి నుంచి 2021 డిసెంబరు వరకు నిర్వహించిన ఇంటింటి సర్వే ప్రాథమిక సమాచారాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. ముఖ్యంగా.. ఇంటర్నెట్‌ యాక్సెస్‌, మొబైల్ యాజమాన్యం, కంప్యూటర్, ఇంటర్నెట్‌ లభ్యత తదితర అంశాలపై సేకరించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుంది. దీంతోపాటు జాతీయ నమూనా సర్వే(NSS) వివరాలనూ ఈ నివేదిక రూపకల్పన కోసం సేకరించింది.

నివేదికలోని కీలక అంశాలు..

* జనరల్ కేటగిరివారిలో ఎనిమిది శాతం మందికి కంప్యూటర్/ల్యాప్‌టాప్ ఉంది. అదే.. ఎస్టీల్లో అయితే ఒక శాతం, ఎస్సీల్లో రెండు శాతం కంటే తక్కువ మందికి ఈ వెసులుబాటు ఉంది.

వేతనాలు పొందుతున్న పర్మినెంట్ ఉద్యోగుల్లో 95 శాతం మంది వద్ద ఫోన్ ఉండగా.. నిరుద్యోగులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారిలో 50 శాతం మంది వద్దే ఫోన్‌ ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్‌ల వినియోగం తగ్గింది. కరోనాకు ముందు గ్రామీణ జనాభాలో కేవలం 3 శాతం మంది వద్దే కంప్యూటర్ ఉండగా.. ఆ తర్వాత అది కాస్త ఒక శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో కంప్యూటర్‌ ఉన్న వారిసంఖ్య 8 శాతంగా ఉంది.

మొబైల్ ఇంటర్నెట్‌ను వినియోగించే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళలకు 33 శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొన్న జీఎస్‌ఎంఏ ‘మొబైల్ జెండర్ గ్యాప్ నివేదిక’ను ఆక్స్‌ఫామ్‌ ఉటంకించింది.

విద్య, ఆరోగ్యం వంటి అవసరమైన సేవలను అందించడంలో డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం కూడా దేశంలోని డిజిటల్ విభజన, దాని పరిణామాలను ప్రతిబింబిస్తోందని నివేదిక పేర్కొంది.

తగ్గించేందుకు సిఫార్సులివే.. 

ఆదాయ అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు.. డిజిటల్‌ సంబంధితంగానూ మారాలని నివేదిక సిఫార్సు చేసింది. ‘సరైన కనీస జీవన వేతనం, పౌరులపై పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించడం, సార్వత్రిక ఆరోగ్యం, విద్య తదితరవాటిపై దృష్టి సారించాలి. ఇంటర్నెట్‌ లభ్యతను పెంచాలి. కమ్యూనిటీ నెట్‌వర్క్‌లు, పబ్లిక్ వైఫై/ ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్‌ల ఏర్పాటుకు సర్వీస్‌ ప్రొవైడర్లు ముందుకు రావాలి. నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలు అందించాలి’ అని నివేదిక పేర్కొంది.

‘డిజిటల్ విభజన కారణంగా దేశంలో అసమానతలు మరింత తీవ్రతరమవుతున్నాయి. ఇంటర్నెట్‌, డిజిటల్‌ పరికరాలు లేనివారు.. విద్య, ఆరోగ్యం, ప్రజాసేవలను పొందడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా.. వారు మరింత వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితులను అరికట్టాల్సిన అవసరం ఉంది’ అని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని