
నిర్భయ దోషులకు ఉరి రేపే!
దిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖాయమైంది. తమపై కేసులు న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్నందున డెత్వారెంట్ను నిలిపివేయాలని నిర్భయ కేసులోని దోషులు దాఖలు చేసిన పిటిషన్ను పటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో ముందు నిర్ణయించిన ప్రకారం నలుగురు దోషులకు రేపు ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు కానుంది.
అంతకు ముందు, నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను దిల్లీలోనే లేనంటూ నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2012 డిసెంబరు 16వ తేదీన అత్యాచార ఘటన సమయంలో తాను దిల్లీలోనే లేనని బుధవారంనాడు దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. దిల్లీ న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో దిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ ఉదయం ముకేశ్ సింగ్ సుప్రీంకోర్టు తలుపుతట్టాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నాడు. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ముకేశ్సింగ్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఇప్పటికే ఈ కేసులో మరో దోషిగా ఉన్న పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయగా ఈ ఉదయం ఆ పిటిషన్ను కూడా కొట్టివేసింది.
మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్(31), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), ముకేశ్ సింగ్(32) న్యాయపరమైన అవకాశాల పేరుతో పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు రేపు (శుక్రవారం) ఉదయం 5.30గంటలకు ఉరితీసేందుకు జైలు అధికారులు సిద్ధం అయ్యారు. దీనిపై మార్చి 5న ట్రయల్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.