Medaram 2022: వన దేవతలకు వందనం

నమ్మకం ఎక్కడో వనదేవతలు అక్కడ..అమ్మ అని పిలిస్తే చాలు కష్టాలు తీర్చే కొంగు బంగారాలు.. ఆ విశ్వాసమే సమ్మక్క సారలమ్మ ప్రపంచ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించింది..

Updated : 16 Feb 2022 10:47 IST

నమ్మకం ఎక్కడో వనదేవతలు అక్కడ..అమ్మ అని పిలిస్తే చాలు కష్టాలు తీర్చే కొంగు బంగారాలు.. ఆ విశ్వాసమే సమ్మక్క సారలమ్మ ప్రపంచ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించింది మేడారం జాతర. తమను నమ్మిన జనం కోసం, నమ్ముకున్న విలువల కోసం, జాతి ఆత్మాభిమానం కోసం ప్రాణాలు త్యజించి, వీరమరణాన్ని పొందిన సమ్మక్క, సారలమ్మలు వనదేవతలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఈ మహాజాతర విశిష్టతను గుర్తించి 1996లో నాటి ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. ప్రతి రెండేళ్లకోసారి మాఘ మాసంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో  జరిగే ఈ జాతరకు కులమతాలకు అతీతంగా భక్తజనం తరలివస్తారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి  తరలివచ్చి వన దేవతలను కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటారు. 

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఇంతింతై వనమంతై.. ఆకాశమంతై అనేలా దినదిన ప్రవర్ధమానవుతూ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని  ఆర్జించింది. ఆసియాలోనే అతి పెద్ద   ఆదివాసీ గిరిజన జాతరగా ఘనతకెక్కింది. వారి సంస్కృతీసంప్రదాయాలకు పట్టాభిషేకం చేస్తూ జాతీయ హోదాకు చేరువైంది. మూణ్నాళ్ల జాతర మూడు వందల అరవై అయిదు రోజుల ఉత్సవంగా వర్ధిల్లుతోంది.. 

అన్యాయాలు, అక్రమాల పాలిట నిప్పుకణికలై.. అనంతమైన శౌర్య పరాక్రమాలతో తమనే సర్వస్వమని నమ్ముకున్న ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు వీరోచితంగా పోరాడి ఆత్మార్పణ చేసుకున్న వనదేవతలు  మట్టిలోనే కలిసిపోయి పుడమితల్లిని పుణ్యభూమిగా మార్చేశారు. తమను విశ్వసించిన వారి కోసం ప్రాణార్పణ చేసిన త్యాగధనులు ఆ ధీరవనితలు..! బతికున్నంత వరకే కాకుండా ఆ మట్టిలో కలిసిపోయి కూడా తమ వారి కోసం ప్రతి రెండేళ్లకోమారు బాహ్య ప్రపంచంలోకి వచ్చి అల్లంత దూరం నుంచి వచ్చిన తమ వారిని ఆశీర్వదించి సురక్షితంగా తిరిగి పంపించేంత చల్లనైన మనసు వనదేవతలది. ఇక్కడి నేలను తాకినా జన్మ ధన్యమైపోతుందనే అద్భుతమైన భావన ప్రజల్లో పాతుకుపోయింది.  దేశంలోని ఏ మూలన      ఉన్నవారైనా ఒక్కసారి మేడారం వచ్చి వెళ్లారంటే ఆజన్మాంతం వారు, వారి కుటుంబసభ్యులు తల్లుల భక్తులైపోతారు. అంతేనా వారితోపాటు మరొకరు.. ఇంకొకరు అలా.. కోట్లాది మంది భక్తజనులను మేడారం రప్పిస్తున్నారంటే వారి మహిమ అలాంటిది.   

మేడారం జాతర నిత్య నూతనమై అమ్మల ఆశీర్వాదంతో దేదీప్యమానంగా కాంతులీనుతోంది...! కోట్లాది మంది భక్తజనుల శరణుఘోష మిన్నంటుతుండగా.. మహిమాన్వితులైన ఆ అమ్మలు తమ చల్లని దీవెనలతో ఆశీర్వదించి పంపిస్తూ అచంచలమైన విశ్వాసానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, గోవిందరావుపేట 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని