క్షమాపణ అంగీకరిస్తున్నా..

కన్నడ నటి సంయుక్త హెగ్డేపై దాడికి దిగిన కవితా రెడ్డి బేషరతుగా క్షమాపణలు అడిగిన సంగతి తెలిసిందే.

Published : 09 Sep 2020 01:10 IST

దాడి ఘటనపై నటి సంయుక్త హెగ్డే

బెంగళూరు: బహిరంగ ప్రదేశంలో పొట్టి దుస్తులు ధరించారంటూ కన్నడ నటి సంయుక్త హెగ్డేపై దాడికి దిగిన కవితా రెడ్డి బేషరతుగా క్షమాపణలు అడిగిన సంగతి తెలిసిందే. కాగా ఆమె క్షమాపణలను తాను అంగీకరిస్తున్నానని.. అందరం కలిసి ముందుకు సాగాలని సంయుక్త ప్రకటించారు. 

సంయుక్త, ఆమె స్నేహితులు ధరించిన దుస్తులు అసభ్యంగా ఉన్నాయని కవితా రెడ్డి దూషిస్తూ, దాడి చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం బెంగళూరులోని అగర సరస్సు సమీపంలో ఉన్న ఓ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వ్యవహారంలో కాంగ్రెస్‌ నాయకురాలు కవితా రెడ్డిపై పోలీసులు సోమవారం పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితురాలు కవితా రెడ్డి ట్విటర్‌ వేదికగా సంయుక్తను క్షమాపణలు కోరారు. ఆ విధంగా ప్రవర్తించటం తన పొరపాటే అని.. అందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని ఆమె ఓ వీడియో ద్వారా ట్విటర్‌లో ప్రకటించారు.

ఇందుకు స్పందించిన సంయుక్త ‘‘మిస్‌ కవితా రెడ్డి, మీ క్షమాపణలను అంగీకరిస్తున్నాను. మనందరం ఆ సంఘటనను వదిలి ముందుకు సాగిపోయి.. మహిళలు ఏ ప్రాంతంలో అయినా సురక్షితంగా ఉండేలా కృషి చేద్దాం. న్యాయవాదులు మైత్రేయి భట్‌, అర్జున్‌ రావుల సహాయానికి ధన్యవాదాలు’’ అని తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని