చాలా రోజులు ప్రేక్షకుల మనసుల్లో నిలుస్తుంది

‘‘సాధారణంగా ఓ సినిమాలో రెండు మూడు పాత్రలే బాగుంటాయి. కానీ మా సినిమాలో ప్రతి పాత్ర అదిరిపోయింది. అదే ఇంత పెద్ద విజయానికి కారణమైంది’’ అన్నారు శ్రీవిష్ణు.

Updated : 29 Aug 2021 08:05 IST

‘‘సాధారణంగా ఓ సినిమాలో రెండు మూడు పాత్రలే బాగుంటాయి. కానీ మా సినిమాలో ప్రతి పాత్ర అదిరిపోయింది. అదే ఇంత పెద్ద విజయానికి కారణమైంది’’ అన్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్‌, సునయిన కథానాయికలు. హసిత్‌ గోలి దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇటీవల హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘గొప్ప పాత్రల్ని సృష్టించాడు దర్శకుడు హసిత్‌. ఈ కథ ఇంత బాగా రావడంలో వివేక్‌ ఆత్రేయ సహకారం చాలా ఉంది. చాలా రోజులు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేస్తా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా బృందం అంతా సినిమా చూసుకున్నాక కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నాం. కానీ ఇంత గొప్ప స్పందన వస్తుందని మాత్రం అనుకోలేదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సినిమాని నమ్మి సాహసం చేసి విడుదల చేశారు నిర్మాతలు. వారి నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఏ పాత్ర ఎలా ఉండాలో దర్శకుడిలో ఎంతో స్పష్టత కనిపించింది. డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్లినప్పుడు నాకు నేనే కొత్తగా అనిపించా. గోలి అంటే హిందీలో బుల్లెట్‌ అని అర్థం. హసిత్‌ గోలి కూడా బుల్లెట్‌లా దూసుకెళతాడు’’ అన్నారు నటుడు రవిబాబు. ఈ కార్యక్రమంలో కథానాయికలు మేఘ ఆకాష్‌, సునైన, సహనిర్మాత వివేక్‌ కూచిభొట్లతోపాటు పంపిణీదారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని