The Challenge: అంతరిక్షంలో సినిమా షూటింగ్‌

అంతరిక్షం నేపథ్యంలో సాగే సినిమాలు చాలానే చూశాం. అవన్నీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయంతో తెరకెక్కినవే. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనే సినిమా షూటింగ్‌ చేయనున్నారు. ఈ సినిమా కోసం చిత్ర  దర్శకుడు, కథానాయిక ...

Updated : 06 Oct 2021 07:00 IST

అంతరిక్షం నేపథ్యంలో సాగే సినిమాలు చాలానే చూశాం. అవన్నీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయంతో తెరకెక్కినవే. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనే సినిమా షూటింగ్‌ చేయనున్నారు. ఈ సినిమా కోసం చిత్ర  దర్శకుడు, కథానాయిక అంతరిక్షంలోకి వెళ్లారు. ‘ది ఛాలెంజ్‌’ పేరుతో రష్యాలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని అంతరిక్షంలో తీయనున్నట్టు గతంలోనే రష్యా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ చిత్ర దర్శకుడు క్లిమ్‌ షిపెంకో, నాయిక యులియా పెరెసిల్డ్‌ అంతరిక్షానికి వెళ్లారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన వ్యోమనౌకలో మరో వ్యోమగామి అంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి అక్కడికి మంగళవారం మధ్యాహ్నం బయల్దేరారు. వాళ్లు అక్కడ 12 రోజులు ఉండనున్నారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ వైద్యుడు అక్కడికి వెళ్లే సన్నివేశం అది. సుమారు 40 నిమిషాలు ఉండే ఈ సన్నివేశాల్ని అంతరిక్షంలోనే తెరకెక్కించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయితే అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా నిలవనుంది. ‘ది ఛాలెంజ్‌’ బృందం ఈ నెల 17న తిరిగి భూమికి చేరుకోనుంది. గతంలో టామ్‌క్రూజ్‌ హీరోగా అంతరిక్షంలో ఓ సినిమాని చిత్రీకరణ చేయనున్నట్టు గతంలోనే ప్రకటన చేశారు. ఇప్పటివరకూ దానికి సంబంధించిన తాజా సమాచారం ఏదీ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని