
Samantha: కుంగుబాటుతో చనిపోతాననుకున్నా
‘‘చెడు రోజులెదురైనా ఫర్వాలేదు. సమస్యలకు వెరవకండి. పోరాడుతూనే ఉండండి. ఇది ఎప్పటికీ అంతంలేని యుద్ధం’’ అంటోంది నటి సమంత. వివాహ బంధానికి స్వస్తి పలికాక తొలిసారి ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలపై నోరు విప్పింది. ‘‘నేనింత దృఢంగా ఉంటానని అసలు అనుకోలేదు. నా వ్యక్తిగత జీవితంలోని సమస్యలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూసి నాకే ఆశ్చర్యమేస్తోంది. ఎందుకంటే నేను చాలా బలహీనురాలిని అనుకున్నాను. విడాకుల తర్వాత బాధతో కుంగిపోయి చనిపోతానని అనుకున్నా. ఇంత బలంగా నిలబడతానని అనుకోలేదు. ఏదేమైనా ఈరోజున ఇలా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఆమె నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ‘యశోద’ అనే కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించింది. అలాగే ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఓ అంతర్జాతీయ సినిమాని ప్రకటించింది. వీటితో పాటు మరో ద్విభాషా చిత్రంలోనూ నటించనుంది.
Advertisement