Bhala Thandhanana Teaser:అవినీతిపై సామాన్యుడి పోరు

జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక కథలతో ప్రయాణం చేస్తుంటారు హీరో శ్రీవిష్ణు. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి తెరకెక్కించారు. రజనీ కొర్రపాటి నిర్మించారు.

Updated : 29 Jan 2022 07:07 IST

జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక కథలతో ప్రయాణం చేస్తుంటారు హీరో శ్రీవిష్ణు. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి తెరకెక్కించారు. రజనీ కొర్రపాటి నిర్మించారు. కేథరిన్‌ కథానాయిక. రామచంద్రరాజు ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను కథానాయకుడు నాని శుక్రవారం విడుదల చేశారు. ‘‘రాక్షసుడ్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి. నేను మామూలు మనిషిని..’’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఈ సంభాషణను బట్టి.. ఓ సామాన్యుడు అవినీతి రాజకీయ నాయకులపై చేస్తున్న యుద్ధంలా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే కథలో ఊహించని మలుపులు, యాక్షన్‌ హంగామా పుష్కలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ‘‘నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్‌మెన్‌కు కూడా రిస్కే’’, ‘‘ఈరోజుల్లో లంచం లేనిదే.. కంచంలో అన్నం కూడా దొరకట్లేదు’’ అంటూ టీజర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ‘‘సీఎం కుర్చీలో కుర్చున్న ఎవరైనా.. ఒక్క సంతకంతో మొత్తం స్టేట్‌ ఫ్యూచర్‌నే మార్చేయొచ్చు. అంటే ఆ పవర్‌.. చేతిదా, లేదంటే కుర్చీదా?’’ అంటూ ఆఖర్లో విష్ణు చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని