బరిలో పది... గెలిచేది ఏది?

సినీ ప్రపంచంలోని నటీనటులంతా ఒక్కసారైన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డును అందుకోవాలని కలలు కనేవారే. వాటిని సాకారం చేసుకునేందుకు చిన్న ఆస్కారం ఉన్న వదులుకోరు.

Published : 10 Mar 2024 05:54 IST

ఆస్కార్‌ నామినేటెడ్‌ చిత్రాల మధ్య గట్టి పోటీ

సినీ ప్రపంచంలోని నటీనటులంతా ఒక్కసారైన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డును అందుకోవాలని కలలు కనేవారే. వాటిని సాకారం చేసుకునేందుకు చిన్న ఆస్కారం ఉన్న వదులుకోరు. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పనిచేసే వారికి ఆస్కార్‌ అవార్డే ఓ వరం. ఆ పురస్కారాన్ని అందుకునేందుకు వివిధ విభాగాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటే ఉత్తమ చిత్రం. ఒక సినిమా బాక్సాఫీసు ముందు వసూళ్ల వర్షం కురిపించింది అంటే అందులో ప్రేక్షకులకు నచ్చిన కథ ఉండాలి. ఆకట్టుకునే నటీనటులుండాలి. కలెక్షన్లతో దూసుకుపోయే సినిమాలు ఒకెత్తైతే.. ఆస్కార్‌ బరిలో నామినేషన్‌ సాధించినవి మరో మెట్టు. అందులో భాగంగా ఈనెలలో అట్టహాసంగా జరగనున్న 96వ ఆస్కార్‌ పురస్కారాల్లో సత్తా చాటేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.


 అత్యధిక వసూళ్లతో రేసులో బార్బీ

 అందమైనది..అందరికీ నచ్చేది..అన్నివయసుల వారు మెచ్చేది బార్బీ బొమ్మ అనడం అతిశయోక్తి కాదేమో. అదే పేరుతో వచ్చిన సినిమా కూడా వినోదాన్ని పంచుతూ ఆస్కార్‌ రేసులో నిలిచింది. ‘బార్బీ’ ఫాంటసీ కామెడీ చిత్రంగా గ్రేట గెర్వింగ్‌ తెరకెక్కించింది. ఫ్యాషన్‌ బొమ్మల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎన్నో కంప్యూటర్‌ యానిమేటెడ్‌ చిత్రాల తర్వాత వచ్చిన తొలి లైవ్‌ యాక్షన్‌గా నిలిచింది. బార్బీ పాత్రలో మాగ్రోట్‌ రాబీ అదరగొట్టింది. 2023లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. టాప్‌ 10 సినిమాల జాబితాలో నిలిచిన ఈ చిత్రం ఎనిమిది నామినేషన్లతో ఆస్కార్‌ రేసులో దిగింది.


అంధుడే ఆ హత్యకు సాక్షి

ఒకరిని హత్య చేసిన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేసే కథనంతో సినిమాలు రావడం మామూలే. అలాంటి తరహా సినిమానే అయినా ఆస్కార్‌ బరిలో దిగిందంటే ఆ కథలో అంధుడైన తమ కుమారుడు ఆ హత్యకు సాక్షి అని పరిగణనలోకి తీసుకోవడమే కారణమని అంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఆ చిత్రమే ‘అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌’. ఫ్రెంచ్‌ లీగల్‌ డ్రామా థ్రిల్లర్‌ చిత్రంగా దర్శకురాలు జస్టీన్‌ ట్రియెట్‌ తెరకెక్కించింది. ఈ సినిమాను తన భర్త మరణంతో తనకేలాంటి సంబంధం లేదని అమాయకంగా ప్రయత్నిస్తున్న ఒక భార్య కథాంశంతో రూపొందించారు. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్న ఈ చిత్రం ఉత్తమ చిత్రంతో పాటు ఐదు నామినేషన్లతో ఆస్కార్‌ వేటలో దూసుకుపోతోంది.


విధి కలిపిన స్నేహితులు

పన్నెండేళ్ల తర్వాత ఇద్దరి చిన్ననాటి స్నేహితుల జీవితాలను కలిపింది విధి. ప్రేమ కావాలని ఒకరు, కాదు..స్నేహితులుగానే ఉందాం అని మరొకరు... ఇలా కొన్నేళ్ల తర్వాత కలుసుకున్న నోరా, హే సంగ్‌ ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు అనేది తెలియాలంటే ‘పాస్ట్‌ లీవ్స్‌’ చూడాలంటోంది ఆ చిత్రబృందం. ఈ అమెరికన్‌ రొమాంటిక్‌ డ్రామాకు సెలీనా సాంగ్‌ దర్శకత్వం వహించింది. ఈమెకిదే తొలిచిత్రం. సాంగ్‌ జీవితంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రేటా లీ, టో యో, జాన్‌ మైగారో కీలక పాత్రల్లో నటించారు. మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌ అవార్డు వేడుకలో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెండు విభాగాల్లో నామినేషన్లను సొంతం చేసుకుంది. మనసుల్ని గెలుచుకున్న ఈ ప్రేమకథ ఆస్కార్‌లో అదరగొడుతుందో లేదో చూడాలి మరి.


సెలవులకు వెళ్లలేని దురదృష్టవంతులు

‘ది హోల్డ్‌ఓవర్స్‌’...అలెగ్జాండర్‌ పేన్‌ రూపొందించిన అమెరికన్‌ కామెడీ డ్రామా. సెలవుల్లో తల్లిదండ్రులు లేని పిల్లల బాగోగులను చూసే కథనంతో వచ్చిన ఈ చిత్రం గతేడాది విడుదలైంది. ప్రతి ఏడాది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది రెండు వారాలపాటు సెలవులు తీసుకుంటారు. కానీ, ఆ సెలవులకు వెళ్లని దురదృష్టవంతులు కొంతమంది ఉంటారు. వారినే ‘హోల్డ్‌ఓవర్స్‌’ అని పిలుస్తారనే సంభాషణలతో సాగిన సినిమా ఆద్యంతం నవ్వులు పంచింది. ఈ చిత్రం ప్రశంసలతో పాటు ఆస్కార్‌లో కూడా తన సత్తా చాటుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఈ సినిమా అయిదు విభాగాల్లో నామినేషన్లతో ఆస్కార్‌లో ముందుకు సాగుతోంది.


నవలా రచయిత కథ..

‘అమెరికన్‌ ఫిక్షన్‌’...సెప్టెంబరు 8న విడుదలైన కామెడీ డ్రామా. ఈ చిత్రంతో కార్డ్‌ జెఫ్ఫెర్‌సన్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మాంక్‌ అనే నవలా రచయిత, ప్రొఫెసర్‌ చుట్టూ తిరిగే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన జాబితాలో టాప్‌ 10 చిత్రాల్లో నిలిచిన ఈ సినిమా ఇటీవల జరిగిన బాఫ్టాలో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డునూ సొంతం చేసుకుంది. జెఫ్రీ రైట్‌, జో-ఇషా రే తదితరలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఆస్కార్‌ వేడుకలో ఉత్తమ చిత్రంతో సహా ఐదు విభాగాల్లో నామినేట్‌ అయ్యింది.


అదే అతడి లక్ష్యం

‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’...2014లో మార్టిన్‌ అమిస్‌ రచించిన నవల ఆధారంగా జోనాథన్‌ గ్లేజర్‌ తెరకెక్కించిన హిస్టారికల్‌ డ్రామా. కలలు కన్న ఇంట్లో తన భార్యతో జీవితాన్ని గడపాలనే వ్యక్తి కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. క్రిస్టియన్‌ ఫ్రిడెల్‌, సాండ్రా హుల్లర్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ విడుదల చేసిన జాబితాలో టాప్‌ 5గా నిలిచింది. ఇటీవల జరిగిన బాఫ్టా వేడుకల్లో మూడు అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో ఐదు విభాగాల్లో నామినేట్‌ అయ్యింది.


బెల్లా పొందిన ప్రాణం

‘పూర్‌థింగ్స్‌’...1992లో అలాస్డర్‌ గ్రే రచించిన పుస్తకం ఆధారంగా యోర్గోస్‌ లాంటిమోస్‌ తెరకెక్కించారు. విక్టోరియన్‌ లండన్‌లోని బెల్లా బాక్ట్సర్‌ అనే యువతి తన మరణానంతరం ఒక శాస్త్రవేత్త ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంటుందనే కథనంతో వచ్చిన సినిమా డిసెంబరు 8న విడుదలైంది. ఇటీవల జరిగిన బాఫ్టా వేడుకల్లో ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను కూడా పొందింది. ఎమ్మా స్టోన్‌, మార్క్‌ రుఫ్పాలో తదితరులు నటించిన ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో పదకొండు విభాగాల్లో  నామినేషన్లను పొందింది. ఈ సినిమా ఇతర చిత్రాలకు ఆ వేడుకల్లో గట్టి పోటి ఇవ్వనుందనే చెప్పాలి.


హైమర్‌కు విజయావకాశాలు ఎక్కువే

కంటెంట్‌ ఉన్న ఏ సినిమా అయినా సరే విజయాన్ని అందుకోక తప్పదు. విమర్శలను ఎదుర్కొన్నా కానీ సినీ ప్రియులను ఆకట్టుకునేది కథ మాత్రమే. ఆ కోవకు చెందినదే క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓపెన్‌ హైమర్‌’. ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ జీవితం ఆధారంగా రూపొందించారు. ఐమాక్స్‌ కెమెరాలతో తీర్చిదిద్దిన ఈ సినిమా జులై 21న విడుదలైంది. ఇటీవల ప్రతిష్ఠాత్మక బాఫ్టా అవార్డుల వేడుకలో అత్యధిక అవార్డులను కొల్లగొట్టిన చిత్రంగా సత్తా చాటింది. అంతే కాదు త్వరలో రానున్న ఆస్కార్‌ పురస్కార వేడుకల్లో ఏకంగా 13నామినేషన్లతో ముందు వరుసలో ఉందీ చిత్రం. సిలియన్‌ మర్ఫీ టైటిల్‌ పాత్ర పోషించిన ఈ చిత్రం గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లోను మెరిసింది. ఆస్కార్‌లో కూడా తప్పక రాణిస్తుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.


మరణంతో ప్రేమకు ముగింపు

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నమ్మలేని నిజాలను తెలుసుకొని ఎంత మదన పడినా లాభం ఉండదు. అలాంటి ఓ రొమాంటిక్‌ ప్రేమకథే ‘మాస్ట్రో’. పెళ్లైన కొన్నిరోజులకు లినార్డో, ఫెలిసియా మధ్య విభేదాలు మొదలవుతాయి. తప్పు తెలుసుకునే నాటికి ఫెలిసియా అనారోగ్యంతో మరణిస్తోంది. వారి ప్రేమకు ఆ మరణం ముగింపు పలుకుతుంది. వారిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమను ‘మాస్ట్రో’ ద్వారా బ్రాడ్లే కూపర్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించారు. కెరీ ములిగన్‌ కీలక పాత్రలో కనిపించింది. నవంబరు 22న విడుదలైన ఈ చిత్రం ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆస్కార్‌లో కూడా ఏడు నామినేషన్లను దక్కించుకుంది.


కిల్లర్స్‌ ఆఫ్‌ ఒసాజ్‌

2017లో డెవిడ్‌ గ్రాన్‌ రాసిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో గతేడాది అక్టోబరు 20న విడుదలైన చిత్రం ‘కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌’. మార్టిన్‌ స్కోర్కెస్‌ దర్శకనిర్మాణంలో వచ్చిన క్రైమ్‌ డ్రామా ఇది. ఒసాజ్‌ ప్రజలు నివసించే స్థలంలో చమురు కనుగొన్న తర్వాత ఒసాజ్‌ సభ్యుల వరుస హత్యల ఆధారంగా తెరకెక్కింది. వారి సంపదను దొంగిలించడానికి రాజకీయ నాయకుడు ప్రయత్నించే కథనంతో రూపొందింది. ‘టైటానిక్‌’ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో, లిల్లీ గ్లాడ్‌ స్టోన్‌ కీలక పాత్రలో నటించారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా ఎడిటింగ్‌, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్‌, నటన పరంగా మంచి విజయంతో పాటు రన్‌టైం విషయంలో కొన్ని విమర్శల్నీ ఎదుర్కొంది. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వేడుకల్లో ఏడు పురస్కారాల్ని అందుకున్న ఈ సినిమా అదే జోరును ఆస్కార్‌లో ప్రదర్శించేందుకు సిద్ధమైంది. పది విభాగాల్లో ఈ సినిమా నామినేటై ఆ చిత్రబృందం పడిన శ్రమకి ఫలితాన్నించేందుకు రంగంలోకి దిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని