Sekhar Kammula: నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!

సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్‌ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది.

Updated : 19 Apr 2024 11:41 IST

సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్‌ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. ఈ శుక్రవారం తన సూపర్‌ హిట్‌ చిత్రం ‘హ్యాపీడేస్‌’ రీరిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం విలేకర్లతో ముచ్చటించారు శేఖర్‌ కమ్ముల. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న సినీ విశేషాలివి.

  • ‘‘నాకు ‘హ్యాపీడేస్‌’ చాలా ప్రత్యేకమైన చిత్రం. అలాంటి మ్యాజిక్‌ మళ్లీ జరగకపోవచ్చు. ఈ మధ్యే నేను దీన్ని మళ్లీ చూశా. అదే ఫ్రెష్‌ ఫీలింగ్‌ కలిగింది. అవుట్‌డేట్‌ అయిపోయినట్లు ఏమాత్రం అనిపించలేదు. 4ఏళ్ల కాలేజీ ప్రయాణం.. అందులోని స్నేహం.. పాటలు అన్నీ ప్రేక్షకుల్ని బాగా పట్టుకున్నాయి. అలాంటి కాలేజీ రోజులు మళ్లీ రావాలని అందరికీ అనిపిస్తుంది. అప్పట్లో ఈ చిత్రం థియేటర్లలో పండగలా నడిచింది. అప్పుడు దాన్ని తెరపై చూడలేకపోయిన ఈతరం మళ్లీ ఇప్పుడీ రీరిలీజ్‌ ద్వారా చూస్తారనుకుంటున్నా’’. 
  • ‘‘నిజానికి నేను ‘హ్యాపీడేస్‌’ తీసే సమయానికి నా కాలేజీ చదువులు పూర్తయ్యి పదేళ్లు దాటిపోయింది. ఆ టైమ్‌లో ఈ కథ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందా.. అవుట్‌డేట్‌ అనుకుంటారా అని సందేహాలు వెంటాడేవి. కానీ, ఆ కథలోని స్నేహం, చదువులు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అందర్నీ అలరించాయి. ఈ మూలాలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు సెల్‌ఫోన్లు, గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాక విద్యార్థులంతా ఎవరి ప్రపంచంలో వాళ్లు ఉంటున్నారేమో అనిపించింది. నాకైతే ఈ మధ్య ‘హ్యాపీడేస్‌’ చూశాక దీనికి సీక్వెల్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనైతే వచ్చింది. కానీ, కథేమీ తట్టలేదు. అది కుదిరినప్పుడు చూడాలి’’.
  •  ‘‘నా పని తీరు నిదానమై ఉండొచ్చు కానీ, నా సినిమాలు బలంగా మాట్లాడతాయని నమ్ముతా. కంటెంట్‌ను కాపీ కొట్టడం.. హిట్లను క్యాష్‌ చేసుకోవడం.. ట్రెండ్‌ వెంట పరుగులు తీయడం.. ఇవన్నీ నాకు తెలియదు. నేను చేసిన కథలన్నీ ఆ సమయానికి అవి చెప్తే బాగుంటుందని నమ్మి నిబద్ధతతో చేసినవే. నాకూ చాలా సినిమాలు చేస్తే.. చాలా బాగుండేదనిపిస్తుంది కానీ, అది సాధ్యం కాదు. వ్యక్తిగతంగా నాకు మదిలో ఓ కథాలోచన పుట్టి.. దాన్ని రాసి.. చేయడానికి కాస్త ఎక్కువ పడుతుంది. ఒకవేళ చకచకా తీయాలని ప్రయత్నిస్తే నేను అనుకున్నది అనుకున్నట్లు చెప్పలేకపోవచ్చేమో అనిపిస్తుంది’’.
  •  ‘‘లీడర్‌’ చేసేటప్పటికే రాజకీయాలు ఓ స్థాయిలో దిగజారిపోయాయి. ఇక అంతకంటే పడిపోవడానికి ఏం లేదనుకుంటే ఇప్పుడు పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి. నేను ‘లీడర్‌’ కథ రాసేటప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి అని రాస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడది చాలా చిన్న విషయం. భవిష్యత్తులో ఈ రాజకీయాలు ఇంకెలా ఉంటాయన్న కోణంలో నుంచి ‘లీడర్‌ 2’ తప్పకుండా చేస్తా. అది రానాతోనే ఉంటుంది. ఇప్పటికే ఓ పాయింట్‌ అనుకున్నా. అది పూర్తి స్క్రిప్ట్‌గా సిద్ధమవ్వాలి. నా కెరీర్‌కు ‘లీడర్‌’ కల్ట్‌ క్లాసిక్‌ అని నమ్ముతా. ప్రేక్షకుల్లోనూ దానికి మంచి ఆదరణ ఉంది. కాకపోతే అది అప్పట్లో మేము ఆశించినంత డబ్బులు చేయలేకపోయింది’’.  
  • ‘‘చాలా పెద్ద భావజాలం గురించి మాట్లాడనున్న కథ ‘కుబేర’. దీంట్లో గొప్ప ఫిలాసఫీ ఉంటుంది. ఈ కథకు ధనుష్‌, నాగార్జున లాంటి తారలు చాలా అవసరం. ఏదో స్టార్లు ఉంటే మార్కెట్‌ వర్కవుటవుతుందని చేస్తున్న ప్రయత్నం కాదిది. నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ సినిమా. తప్పకుండా ఎవరినీ నిరుత్సాహపరచదు’’.

‘‘ఈ సుదీర్ఘ సినీ ప్రయాణం నాకైతే గర్వంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచం క్రూరమైనది. కఠినమైన సవాళ్లతో నిండి ఉంటుంది. ఇక్కడ సక్సెస్‌ ఇస్తే పైన ఉంటాం.. లేదంటే పాతాళంలో పడిపోతాం. ఆర్థికంగా నేను మరీ అంత బలవంతుడ్ని కాకున్నా.. ఇలాంటివన్నీ ఎదుర్కొని.. ఎక్కడా రాజీ పడకుండా నాదైన విలువలు, సిద్ధాంతాలతో సినిమాలు తీసి, అందర్నీ మెప్పించి ఇక్కడ స్థిరంగా నిలబడగలిగినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల్లో సమాజంపై ప్రతికూల ప్రభావం చూపించే అంశాలేవీ లేకుండా చూసుకున్నానన్నది ఎక్కువ సంతృప్తినిస్తుంటుంది. అలాగే ఈ 25ఏళ్లలో పేరు కోసమో.. డబ్బు కోసం ఎప్పుడూ ఏ సినిమా తీయలేదు. అది కూడా నాకు చాలా గర్వాన్నిస్తుంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని