వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం

‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’  అన్నారు సత్యదేవ్‌.

Updated : 09 May 2024 10:10 IST

‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’  అన్నారు సత్యదేవ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. కొరటాల శివ సమర్పకుడు. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సత్యదేవ్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘ముగ్గురు స్నేహితుల కథ ఇది. జీవితం గురించి వాళ్లు కన్న కలల్ని వేరొకరు నిర్వీర్యం చేసినప్పుడు జరిగే సంఘర్షణ ఎలాంటిదనేది తెరపైనే చూడాలి. వించిపేట భద్ర అనే పాత్రలో నేను కనిపిస్తా. తనకున్న పగ ఎలాంటిది? ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేశాడనేది ఆసక్తికరం. ఈ పాత్ర కోసం, విజయవాడ యాస కోసం, హావభావాల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమై నటించా. నిజ జీవితంలో కొన్ని సంఘటనలకి కల్పితాల్ని జోడించి ఈ చిత్రాన్ని మలిచారు గోపాలకృష్ణ. ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టిన ఆఖరి వ్యక్తిని నేనే. కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడైనా... ఆయన కథ పరంగా ఎలాంటి మార్పులూ సూచించలేదు. ఆయనకి ఈ కథ అంత బాగా నచ్చింది’’ అన్నారు సత్యదేవ్‌. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ... ‘‘నేను ఎంచుకొంటున్న కొత్త రకమైన కథలు, పాత్రలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. ప్రతి సినిమాతోనూ ఓ విభిన్నమైన పాత్ర చేసే అవకాశం లభిస్తోంది. ‘గాడ్‌ఫాదర్‌’, ‘రామసేతు’ తదితర సినిమాలతో సహాయ నటుడిగా, ప్రతినాయక పాత్రలతోనూ ఓ స్థాయి ఉన్న పాత్రల్ని చేశా. అందుకు సమానమైన పాత్రలొస్తే చేయడానికి నేను సిద్ధమే’’ అన్నారు సత్యదేవ్‌.


నరాచీ, ఖాన్సార్‌లను కలుపుతూ..

 తాను తీస్తున్న ప్రతి సినిమాతోనూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘కె.జి.ఎఫ్‌’లో నరాచీ, ‘సలార్‌’లో ఖాన్సార్‌ నగరాల్ని చూపిస్తూ  పాత్రల్ని మలిచారు. ఈ వేర్వేరు ప్రపంచాల్ని, పాత్రల్ని కలుపుతూ తదుపరి సినిమాలు చేసే ఆలోచనలో ప్రశాంత్‌ నీల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అవే సంకేతాల్నే ఇచ్చారు ‘సలార్‌’లో కీలకమైన పాత్ర పోషించిన కథానాయకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ‘‘ప్రశాంత్‌ నీల్‌ నాకు చెప్పిన కథలన్నింటిలో శివ మన్నార్‌ పాత్ర అద్భుతం. ఈ పాత్ర మరొక ప్రపంచంతోనూ ముడిపడి ఉంటుంది’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. దీంతో శివ మన్నార్‌ పాత్ర ఏ సినిమాలో ఉండే అవకాశాలున్నాయా అంటూ సినీ అభిమానులు ఆత్రుతగా ఆరా తీయడం మొదలుపెట్టారు.


దైవశక్తి... దుష్ట శక్తులకీ మధ్య

ఉగ్రనేత్రుడి ఆత్మశక్తిని సొంతం చేసుకోవడం కోసం ఒకవైపు అఘోరాలు... మరోవైపు  దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జరిగిన పరిణామాలేమిటో తెరపైనే చూడాలంటోంది ‘వృషభ’ బృందం. జీవన్‌ రెడ్డి, అలేఖ్య జంటగా నటించిన చిత్రమిది. అశ్విన్‌ కామరాజ్‌ కొప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఉమాశంకర్‌ రెడ్డి నిర్మాత. ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి కుమార్తె మల్లికారెడ్డి సహ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌, పాట విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు వి.సముద్ర, రేలంగి నరసింహారావు, నిర్మాతలు దామోదర్‌ ప్రసాద్‌, సాయివెంకట్‌, మహేంద్ర, నటులు అజయ్‌ ఘోష్‌, శివారెడ్డి, విశ్వ కార్తికేయ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘దైవశక్తికీ, దుష్టశక్తులకీ మధ్య సాగే కథ ఇది.’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘1960 దశకం నేపథ్యంలో సాగే ఈ కథ, కథనాల్ని దర్శకుడు రాజీ పడకుండా తెరపైకి తీసుకొచ్చారు’’ అన్నారు. ‘‘మట్టి వాసనతో కూడిన కథ ఇది. ట్రైలర్‌, పాట చాలా బాగున్నాయి. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నారు అతిథులు.


మలయాళ దర్శకుడు సంగీత్‌ శివన్‌ కన్నుమూత

ప్రముఖ మలయాళ దర్శకుడు సంగీత్‌ శివన్‌ (65) కన్నుమూశారు. బుధవారం గుండెపోటు రావడంతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆయన సోదరుడు, సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మలయాళ చిత్రాలు ‘యోధ’, ‘నిర్ణయం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన రఘవరన్‌, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ‘వ్యూహమ్‌’తో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. హిందీలో కూడా ‘జోర్‌’, ‘చురాలియా హై తుమ్నే’, ‘ఏక్‌: ది పవర్‌ ఆఫ్‌ వన్‌’, ‘క్లిక్‌’, ‘క్యా కూల్‌ హై హమ్‌’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. సంగీత్‌ మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు రితేష్‌ దేశ్‌ముఖ్‌, శ్రేయాస్‌ తల్పడే తదితర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు