Published : 11 Jan 2021 19:56 IST

అసంపూర్ణ చిత్రం...ఉదయ్‌ కిరణ్‌

ఉదయించి మధ్యాహ్నానికి చేరకుండానే... మబ్బులు కమ్మి చిక్కటి చీకట్లు అలముకున్నట్టు అర్ధాంతరంగా అంతర్ధానమైన ఓ కిరణం గురించి తలచుకుంటేనే గుండెలు బరువెక్కుతాయి. కన్నీళ్లు కనురెప్పల్ని తడిమేస్తాయి. ఎంతో ఉజ్వల భవిష్యత్‌ ఉన్న ఓ యువకుడు... ఎంచుకున్న రంగంలో చెప్పుకోదగ్గ విజయాల్ని చేజిక్కించుకున్నా వ్యక్తిగత జీవితంలో అనూహ్య కుదుపుల్ని తట్టుకోలేని బలహీనతే ఓ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. తెరపై హీరోలా వెలుగొంది... ఎంతోమందికి స్ఫూర్తినివ్వాల్సిన వ్యక్తి కూడా అలా బలవన్మరణానికి పాల్పడడం... సమాజంలో పేరుకుపోయిన అభద్రతను చాటిచెప్తోంది. ఔత్సాహిక చిత్రకారుడు అస్తవ్యస్తంగా వేసిన రంగుల చిత్రం... కకావికలమై అసంపూర్ణ చిత్రంగా మిగిలిపోయిన ఓ కళాకారుడి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే... అలాంటి దుందుడుకు నిర్ణయాలు మరే వ్యక్తి తీసుకోకూడదనే సందేశం కూడా అంతర్లీనంగా దాగుంది. అసంపూర్ణ చిత్రంలా మిగిలి... అడపాదడపా గుర్తొచ్చినప్పుడు గుండెని మెలిపెట్టే బాధని మిగిల్చిన ఆ సినీ కళాకారుడు... మూడు దశాబ్దాల్లోనే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన ఉదయ్‌ కిరణ్‌. ఓ కొత్త సంవత్సరం మొదటి వారంలోనే ఆత్మహత్య చేసుకుని ఓ ఉదయాన్ని శోకతప్త హృదయంగా మార్చేసిన యువ కధానాయకుడు ఉదయ్‌ కిరణ్‌. 2014 జనవరి 5, ఉదయ్‌ కిరణ్‌ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. కొన్నేళ్లపాటు సినీ వినోదాన్ని అందించిన ఈ హీరో... అంతకు మించిన విషాదాన్ని అందించాడు.


వ్యక్తిగతం

ఉదయ్‌ కిరణ్‌ వాజపేయాజుల 1980 జూన్‌ 26న వీవీకే మూర్తి, నిర్మల దంపతులకు జన్మించాడు. జన్మస్థలి హైదరాబాద్‌. జూబిలీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న కేవి పికేట్‌లో స్కూల్‌ విద్య పూర్తి చేసిన ఉదయ్‌ కిరణ్‌ సికింద్రాబాద్‌లోని వెస్లీ డిగ్రీ కాలేజ్‌లో బీకామ్‌ చదివాడు. కాలేజ్‌ రోజుల్లోనే మోడలింగ్‌ పట్ల ఆసక్తి కనబరిచిన ఆయన చదువు తరువాత సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఇండస్ట్రీలో ఉదయ్‌ కిరణ్‌ మార్గదర్శి సినిమాటోగ్రఫేర్, డైరెక్టర్‌ తేజ. మొదటి మూడు చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేకుండా పోయింది. చిత్రాల్లో విజయం సాధించినా ...జీవితంలో కొన్ని దురదృష్ట సంఘటనలు తలెత్తడంతో ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా తన పెళ్లి వేడుక నిశ్చితార్థం వరకూ వచ్చి ఆగిపోయింది. ఆ తరువాత 2012 అక్టోబర్‌ 24న విషితని వివాహమాడాడు.

హ్యాట్రిక్‌ హీరో

చిత్రసీమలోకి దూసుకువచ్చిన యువ కెరటం ఉదయ్‌ కిరణ్‌. వస్తూ వస్తూనే సత్తా నిరూపించుకున్నాడు. కొత్తని ఎప్పుడూ ప్రోత్సహించే ప్రతిష్టాత్మక సంస్థ ఉషా కిరణ్‌ మూవీస్‌ నిర్మించిన చిత్రం ద్వారా తెరంగేట్రం చేసాడు ఉదయ్‌ కిరణ్‌. ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఆర్పీ పట్నాయక్‌ సమకూర్చిన బాణీలు, కధానాయిక రీమాసేన్‌ కధానాయకుడు ఉదయ్‌ కిరణ్‌ మధ్య పండిన రొమాంటిక్‌ డ్రామా ఈ చిత్ర విజయానికి కారణమయ్యాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని చవిచూసిన చిత్రం సినిమాతో అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకుల కళ్ళు పడ్డాయి. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంతో ఉదయ్‌ కిరణ్‌ యువ హృదయాల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ మూడు చిత్రాలు హిట్‌ అవ్వడంతో హ్యాట్రిక్‌ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత ‘కలుసుకోవాలని’, ‘శ్రీరామ్‌’, ‘హొలీ’ ‘నీ స్నేహం’, ‘జోడీ నంబర్‌ వన్‌’, ‘నీకు నేను నాకు నువ్వు’, ‘లవ్‌ టుడే’, ‘ఔనన్నా కాదన్నా’, ‘వియ్యాలవారి కయ్యాలు’, ‘గుండె జల్లుమంది’, ‘ఏకలవ్యుడు’, ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’, ‘జై శ్రీరామ్‌’ ‘చిత్రం చెప్పిన కధ’... తదితర చిత్రాల్లో ఉదయకిరణ్‌ నటించాడు. కొన్ని తమిళ చిత్రాల్లో సైతం ఆయన నటించడం విశేషం. 2006లో ‘పోయి’ అనే తమిళ చిత్రంలో దర్శకుడు బాలచందర్‌ దర్శకత్వంలో నటించాడు. ఆ చిత్రం తెలుగులో ‘అబద్దం’ పేరుతో విడుదలయింది. 2010లో ‘పెన్‌ సింగం’ తమిళ ఛితంలో నటించాడు. ఆ చిత్రం తెలుగులో ‘అల్లాడిస్తా’ పేరుతో రిలీజ్‌ అయింది. వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో ‘ఈ పెద్దోల్లలున్నారే’ చిత్రం నిర్మాణంలో ఉండగా... ఉదయ్‌ కిరణ్‌ కన్నుమూశాడు. చాలా చిత్రాల్లో రొమాంటిక్‌ హీరోగా కనిపించిన ఉదయ్‌ కిరణ్‌... ‘శ్రీరామ్‌’ చిత్రం ద్వారా యాక్షన్‌ హీరోగా కూడా తనని నిరూపించాలనుకున్నాడు. కానీ, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించడంలో విఫలమైనది.

ఫిలిం ఫేర్‌ అవార్డు

‘నువ్వు నేను’ చిత్రంలో నటనకుగాను 2001లో ఫిలిం ఫేర్‌ అవార్డు ఉదయ్‌ కిరణ్‌ని వరించింది. 2002లో ‘నీ స్నేహం’ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డుకి నామినేషన్‌ పంపించారు.

అర్ధాంతరంగా అసువులు బాసి...
భార్య విషితతో కలిసి ఉదయ్‌ కిరణ్‌ హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీ జ్యోతి హోమ్స్‌లో ఫ్లాట్‌లో ఉండేవాడు. త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లో ఓ గదిని వ్యాయామశాలగా మార్చుకుని ప్రతిరోజూ ఉదయ్‌ కిరణ్‌ వ్యాయామం చేసేవాడు. 2014లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు భార్యతో కలసి బెంగళూర్‌ వెళ్లిన ఉదయ్‌ కిరణ్‌ జనవరి 2న హైదరాబాద్‌ వచ్చాడు. జనవరి 5న తన సహోద్యోగి పుట్టినరోజు వేడుకలకు విషిత మణికొండ వెళ్లగా అదే రోజు ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన సంచలనం అయ్యింది. మానసిక క్షోభతో మద్యం సేవించిన తరువాత ఉదయ్‌ కిరణ్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫోరెన్సిక్‌ నివేదిక అందడంతో... కేసు క్లోజ్‌ అయ్యింది. రంగుల ప్రపంచంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఓ యువ కెరటం అలా అర్ధాంతరంగా అసువులు బాసింది. ఉదయ్‌ కిరణ్‌ మృతి వార్త ఎంతో మందిని కలచివేసింది. అలనాటి నటుడు రంగనాధ్‌... ఆత్మహత్యల ద్వారా ఎవ్వరూ ప్రాణాలు తీసుకోకూడదని... ఉదయ్‌ కిరణ్‌ తనతో మాట్లాడి ఉంటే మనసు మార్చుకునేవాడని ఈ సంఘటన తరువాత చెప్పుకొచ్చారు. అయితే... అలా చెప్పిన ఆయన కూడా ఓ బలహీన క్షణంలో ఆత్మహత్యకు పాల్పడడం పెను విషాదం. అన్నీ కోల్పోయినా... రేపనేది ఉంటుందన్న సంగతి గుర్తెరిగి జీవితాల్ని ఆత్మహత్యలకు బలిపెట్టవద్దనే ఇలాంటి దుర్ఘటనలే పదే పదే సూచిస్తున్నాయి. ఉదయ్‌ కిరణ్‌ జీవితం...ఆత్మహత్యల నుంచి యువత నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఉదయ్‌ కిరణ్‌ మనమధ్య లేకున్నా... ఆయన నటించిన కదిలే బొమ్మలు కమ్మని కబుర్లు చెప్తూనే ఉంటాయి. ఆ చిత్రాలకు మరణం లేదు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని