Prabhas: అందరూ భోజనం చేసి వెళ్లండి: బాధలోనూ ప్రభాస్‌ పెద్దమనసు

ఇండస్ట్రీలో అతిథి మర్యాదల విషయంలో దివంగత కృష్ణంరాజుకి తిరుగు లేదు. ఆయన సినిమా షూటింగ్‌లో యూనిట్‌ అంతటికి భోజనం సిద్ధం చేయించేవారని ఎందరో నటులు చెప్పారు. ప్రస్తుతం పాన్‌ఇండియా...

Published : 14 Sep 2022 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో అతిథి మర్యాదల విషయంలో దివంగత కృష్ణంరాజుకి తిరుగు లేదు. ఆయన సినిమా షూటింగ్‌ సమయంలో యూనిట్‌ అంతటికి భోజనం సిద్ధం చేయించేవారని ఎందరో నటులు చెప్పారు. ప్రస్తుతం పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) కూడా ఆతిథ్యం విషయంలో పెద్ద మనసే. ఇటీవల కృష్ణంరాజు అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రభాస్‌ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారంతా అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ అక్కడే ఉన్నారు. అయితే అంత్యక్రియల హడావుడిలో ఉన్న ప్రభాస్‌, అంత బాధలోను అభిమానుల్ని ఆప్యాయంగా పలకరించారట. ‘అందరూ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్‌’ అంటూ ప్రభాస్‌ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. అభిమానులపై ప్రభాస్‌కి ఉండే ఆప్యాయతే వేరు, మా ప్రభాస్‌ అన్న దేవుడు అంటూ సోషల్‌మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ప్రభాస్‌కు అరుదైన ఆహ్వానం

దిల్లీలో జరిగే ప్రతిష్ఠాత్మక రావణ దహనం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు రామ్‌లీలా కమిటీ సభ్యులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి గతంలో అజయ్‌దేవగణ్‌ పాల్గొనగా ఈ ఏడాది ప్రభాస్‌ని ఆహ్వానించినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ అరుదైన ఆహ్వానంపై ప్రభాస్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓం రౌత్‌ దర్శకత్వంలో రానున్న ఆదిపురుష్‌(Aadi Purush)లో ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. ఇంకా సలార్(Salaar)‌, ప్రాజెక్ట్.కె‌ (Project K), స్పిరిట్‌ (Spirit) లాంటి మూడు భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రభాస్‌ ఖాతాలో  ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని