Kamal Haasan: ఆ రోజు వాళ్లెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు: కమల్‌ హాసన్‌

ఓటీటీలపై కమల్‌ హాసన్‌ (Kamal Haasan) మాట్లాడారు.  వీటి గురించి తాను ముందే చెప్పనని అన్నారు.

Published : 29 May 2023 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఓటీటీల (OTT) హవా కొనసాగుతోంది. థియేటర్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. మరికొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలై సూపర్‌ హిట్‌ అవుతున్నాయి. అయితే స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) వీటి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను ఓటీటీల గురించి కొన్ని సంవత్సరాల ముందే చెప్పానని ఆయన అన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీలోని వాళ్లెవ్వరూ తన మాటలు పట్టించుకోలేదని తెలిపారు. 

దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డు వేడుకలో కమల్‌ హాసన్‌ ఓటీటీల గురించి మాట్లాడారు.. ‘‘ఓటీటీ వ్యవస్థ వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దీని కోసం ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాను. కానీ ఆ సమయంలో సినిమా పరిశ్రమలోని వారంతా నా మాటలను పట్టించుకోలేదు. నా ఆలోచనలను అంగీకరించలేదు. కానీ.. ఈ రోజు వారికి అర్థమైంది. ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కడి నుంచైనా అన్ని భాషల్లోని సినిమాలను చూస్తున్నారు.  నేను చిన్న సినిమాలకు వీరాభిమానిని. అలాంటి సినిమాలు చేసే పెద్ద స్టార్‌ అయ్యాను. కథలు విన్నప్పుడు.. కొన్నింటిలో నటించాలనుకుంటాను.. మరికొన్నింటిని నిర్మించాలనుకుంటాను. ప్రస్తుతం కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. కేవలం నిర్మాతగానే ఉంటాను. వాటి గురించి మిగతా విషయాలు పట్టించుకోను’’ అని అన్నారు.

2013లో ‘విశ్వరూపం’ను ఓటీటీ తరహాలో డబ్బు చెల్లించి ఇంట్లో కూర్చొని చూసేలా ఏర్పాటు చేయాలని కమల్‌హాసన్‌ అప్పట్లోనే ప్రయత్నించారు. కానీ థియేటర్‌ యాజమాన్యం, కొందరు సినీ ప్రముఖులు దీన్ని వ్యతిరేకించడంతో ఈ డైరెక్ట్‌-టు-హోమ్‌ ప్రోగ్రామ్‌ను పక్కన పెట్టారట. ఇక ఆరు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నందుకు గాను కమల్‌ను ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం వరించింది. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్‌2’ (Indian 2) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.  ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), రకుల్ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని