Liger: దీక్ష విరమించిన ‘లైగర్‌’ ఎగ్జిబిటర్లు

‘లైగర్‌’ (Liger) సినిమా నైజాం ఎగ్జిబిటర్లు గురువారం దీక్షను విరమించారు. పూరీ, ఛార్మి తమకు త్వరితగతిన న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

Published : 18 May 2023 18:19 IST

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger) వల్ల తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ నైజాం ఎగ్జిబిటర్లు తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎదుట గత శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం వాళ్లు తమ ధర్నాని విరమించుకున్నారు. నిర్మాతల మండలి అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హామీ ఇవ్వడం వల్లే తాము ఈ ధర్నాను నిలిపివేస్తున్నామని తెలిపారు. పలువురు ఎగ్జిబిటర్ల అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఛార్మి, పూరీ జగన్నాథ్‌ త్వరితగతిన తమకు న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’ (Liger). అనన్యా పాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్‌, కరణ్‌ జోహార్‌ దీన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఈనేపథ్యంలో ‘లైగర్‌’ చిత్రాన్ని కొనుగోలు చేసి తాము నష్టపోయామంటూ నైజాం ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పూరీ ఇంటి వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఆయన.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలోనే ఆరు నెలలైనా పూరీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదంటూ ఎగ్జిబిటర్లు ఇటీవల రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఛార్మి.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని, డబ్బు అందచేస్తానని పేర్కొంటూ ఫిల్మ్‌ ఛాంబర్‌కు మెయిల్‌ పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని