Sunny Deol: 2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్‌

2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్‌ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

Published : 30 Apr 2024 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటులు సన్నీదేవోల్‌, బాబీ దేవోల్‌ ఇద్దరూ తాజాగా కపిల్‌శర్మ షోకు అతిథులుగా హాజరయ్యారు. ఇండస్ట్రీకి వచ్చాక ఎదుర్కొన్న ఒడుదొడుకులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. గతేడాదిలో ఈ కుటుంబం అద్భుతమైన విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. దేవోల్ బ్రదర్స్‌ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్‌ అయ్యారు.

సన్నీ దేవోల్‌ మాట్లాడుతూ.. ‘1960 నుంచి మా కుటుంబం ఇండస్ట్రీలో ఉంది. అప్పటినుంచి కొత్తగా అలరించేందుకు మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ కొన్ని విషయాల్లో మా ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. 2023లో ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’తో మా నాన్న తొలి విజయాన్ని అందుకున్నారు. తర్వాత ‘గదర్‌ 2’తో నేను ఆకట్టుకున్నాను. ఏడాది చివర్లో ‘యానిమల్‌’తో బాబీ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నాడు. అన్నిటికంటే ముందు మా కుమారుడి పెళ్లి జరిగింది. ప్రజలు మమ్మల్ని ఈ ఏడాది ఎంతో ఆదరించారు’ అని భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం ప్రస్తావిస్తుండగానే బాబీ దేవోల్‌ కూడా కంటతడి పెట్టుకున్నారు. ‘ప్రతి కుటుంబానికి ఒక సూపర్‌మ్యాన్‌ ఉంటాడు. మా ఫ్యామిలీలో అది మా సన్నీనే. మా నాన్న కూడా మమ్మల్ని స్నేహితులుగా భావిస్తారు. సలహాలు కూడా అలానే ఇస్తారు’ అని బాబీ చెప్పారు.

ఇక ‘యానిమల్‌’ తర్వాత బాబీ దేవోల్‌ దక్షిణాదిలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రానున్న సినిమాలో (#NBK109) ఆయన విలన్‌గా నటించనున్నారు. అలాగే సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తోన్న  ‘కంగువా’లోనూ కీలకపాత్రలో కనిపించనున్నారు. వీటితో పాటు నాగార్జున హీరోగా రానున్న యాక్షన్‌ థ్రిల్లర్‌లోనూ ప్రతినాయకుడిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని