Swayabhu: తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు

‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్‌. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు.

Updated : 08 May 2024 09:43 IST

‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్‌. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్‌, నభా నటేష్‌ కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమా కోసం రూ.8కోట్ల ఖర్చుతో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రెండు భారీ సెట్‌లను సిద్ధం చేశారు. అందులోనే నిఖిల్‌తో పాటు 700మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, వియత్నాం ఫైటర్లపై యుద్ధ నేపథ్య సన్నివేశాల్ని రూపొందిస్తున్నారు. దాదాపు 12రోజుల పాటు ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ కొనసాగనుంది. ఈ వార్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని.. వెండితెరపై ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో నిఖిల్‌ ఓ యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


కరెన్సీ నోట్ల రద్దు నేపధ్యంలో 100 క్రోర్స్‌

రాహుల్‌, చేతన్‌, యమీ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘100 క్రోర్స్‌’. విరాట్‌ చక్రవర్తి దర్శకుడు. దివిజా కార్తీక్‌,  సాయికార్తీక్‌ నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్‌లో  ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. వీరశంకర్‌, మల్లిక్‌రామ్‌, హర్షిత్‌ రెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత సాయికార్తీక్‌ మాట్లాడుతూ ‘‘2016లో జరిగిన యథార్థ సంఘటనలతో రూపొందిన  చిత్రమిది. కరోనా తర్వాత ఈ కథాంశాన్ని అనుకుని ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాం. సినిమాని చూసినవాళ్లంతా బాగుందని  మెచ్చుకుంటున్నారు. చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కన్నడ నటుడు చేతన్‌ తెలుగులో పరిచయం అవుతున్న చిత్రమిది. కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ఆసక్తికరమైన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు విరాట్‌ చక్రవర్తి. సంగీత దర్శకుడిగా విజయాల్ని అందుకున్న సాయికార్తీక్‌, ఈ చిత్రంతో నిర్మాతగానూ మంచి ఫలితాల్ని సొంతం చేసుకుంటాడని ఆశిస్తున్నాం’’ అన్నారు అతిథులు.  కథానాయకుడు మాట్లాడుతూ ‘‘సాయికార్తీక్‌తో నాకు పదిహేనేళ్లుగా అనుబంధం ఉంది. ఆయన నిర్మించిన సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతుండడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొంది.


400ఏళ్లుగా ఆ నిధికి సంరక్షకుడు బరోజ్‌

ఏడాది ‘మలైకోటై వాలిబన్‌’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ ఇప్పుడు ఫాంటసీ చిత్రం ‘బరోజ్‌’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న తొలి చిత్రమిది. ‘గార్డియన్‌ ఆఫ్‌ ట్రెజరర్‌’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. 400ఏళ్లుగా ఓ నిధికి సంరక్షకుడిగా ఉన్న బరోజ్‌ పాత్రలో మోహన్‌లాల్‌ కనిపించన్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారీయన. సెప్టెంబరు 12న ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. యువరాణిలా కనిపించే ఓ చిన్నపాపను మోహన్‌లాల్‌ నవ్విస్తున్న ఆ పోస్టర్‌ అద్భుతంగా ఉందంటున్నాయి చిత్రవర్గాలు. త్రీడీలో రూపొందించిన ఈ చిత్రానికి లిడియన్‌ నాధస్వరం, మార్క్‌ కిలియన్‌ సంగీతం అందిస్తున్నారు.


సూపర్‌ విలన్‌ను ఢీ కొట్టే సామాన్యుడు

కథానాయకుడిగా సి.వి కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాయవన్‌’. వీళ్లిద్దరి కలయికలోనే వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘ప్రాజెక్ట్‌ జెడ్‌’కు కొనసాగింపుగా ఉంటుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం సందీప్‌ కిషన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అందులో సందీప్‌ సూపర్‌ పవర్‌ ఉన్న వెపన్‌తో పిడికిలి బిగించి సమరానికి సిద్ధమైనట్లుగా ఆసక్తికరంగా కనిపించారు. ‘‘ఇదొక భిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌. సూపర్‌ విలన్‌తో సామాన్యుడి ఘర్షణ ఇతివృతంగా ఉండనుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని