Rajkumar: నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత

కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్‌ బొల్లా. బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్‌’ చిత్రం తెరకెక్కింది.

Updated : 07 May 2024 09:38 IST

కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్‌ బొల్లా. బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్‌’ చిత్రం తెరకెక్కింది. అందరి కళ్లు తెరిపించడానికి వస్తున్నా... అనే ఉపశీర్షికతో ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తుషార్‌ హీరానందాని దర్శకుడు. ఇందులో శ్రీకాంత్‌ బొల్లా పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ యువ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌ నటించారు.  ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన టీచర్‌గా జ్యోతిక నటించారు. చిత్రం విడుదలని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లో  రాజ్‌కుమార్‌ రావ్‌ విలేకర్లతో ముచ్చటించారు.

పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?

ఇలాంటి పాత్రలకి పరిశోధనతోపాటు, సన్నద్ధత చాలా  అవసరం. దాంతో కొన్నాళ్లపాటు ముంబయిలోని అంధుల పాఠశాలలకి వెళ్లి అక్కడి విద్యార్థుల్ని కలిశా. వాళ్ల గురించి తెలుసుకుని, వాళ్ల హావభావాల్ని పరిశీలించా. కొన్నిసార్లు వీడియోలు తీసుకుని ఇంటికి వెళ్లి పదే పదే చూసేవాణ్ని.  ఇదంతా శారీరకంగా పాత్రలా కనిపించడానికి మేలు చేసింది కానీ, అసలు శ్రీకాంత్‌ని కలిశాకే తన జీవితంలోని నాటకీయత, భావోద్వేగాలు అర్థమయ్యాయి. నిజ జీవిత వ్యక్తుల్లాగా వేషం ధరించి తెరపై కనిపించినంత మాత్రాన అది బయోపిక్‌ అయిపోదు. వాళ్ల జీవితాల్లోని భావోద్వేగాల్నీ పట్టుకోవాలి. అప్పుడే ఆ పాత్రలో జీవించేందుకు వీలవుతుంది.

ఈ సినిమా చేయడానికి ముందు శ్రీకాంత్‌ బొల్లా గురించి మీరు విన్నారా?

కొంచెమే తెలుసు. ఈ సినిమా ప్రయాణం మొదలయ్యాక శ్రీకాంత్‌కి ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, ఆయన సాధించిన లక్ష్యాల గురించి మరింత వివరంగా తెలిశాయి. పేదరికంతో కూడిన బాల్యం, చదువు, అమెరికా ప్రయాణం... ఇలా ఆయన జీవితంలోని ప్రతి అడుగులోనూ ఎన్నో ఆటంకాలున్నాయి. వాటన్నిటినీ దాటుకుంటూ చేసిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.  దృష్టిలోపం ఉన్న యువకుడైనా ఆత్మవిశ్వాసంతో పారిశ్రామికవేత్తగా ఎదిగి మిలియన్‌ డాలర్ల కంపెనీని స్థాపించాడు. తనలాంటి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. శ్రీకాంత్‌ జీవితాన్ని విన్న వెంటనే ఇలాంటి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ప్రపంచానికి తెలియాల్సిందే అనిపించింది. సవాళ్లతో కూడిన ఇలాంటి ఓ పాత్రని పోషించాలని నటుడిగానూ ఎంతో ఆత్రుతకి గురయ్యా.

ట్రైలర్‌ చూశాక శ్రీకాంత్‌ పాత్రలో నటించడం కాదు, జీవించారనే అభిప్రాయం కలుగుతుంది. సెట్‌లో ఆ పాత్ర చేస్తున్నప్పుడు మీకెలాంటి ఆలోచనలు వచ్చేవి?

సెట్‌లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. చూడగలిగే అవకాశం ఉన్నా... చుట్టూ పరిసరాల్ని కూడా గమనించకుండా రోజుకి 12, 13 గంటలు శ్రీకాంత్‌లాగే ఉంటూ, ఆయన జీవితాన్నే గడిపేవాణ్ని. చాలా కష్టంగా అనిపించేది. అయితే శ్రీకాంత్‌ని కలవడానికి ముందు...  తన జీవితం ఎంత కష్టంగా ఉంటుందో, రోజువారీ పనుల్లో చాలా మంది సహాయం తీసుకుంటారేమో అనే అభిప్రాయంతో ఉండేవాణ్ని. కానీ శ్రీకాంత్‌ చాలా సాధారణంగా జీవితాన్ని గడుపుతుంటారు. తన పనులు తాను సొంతంగా, సులభంగా చేసుకోగల సమర్థత తనలో కనిపించింది. ఎదుటివాళ్ల నుంచి గౌరవాన్ని కోరుకుంటారు తప్ప జాలి, కరుణ లాంటివి అస్సలు ఇష్టపడరు. తనకి కావల్సింది అవకాశమే అనే థృక్పధంతో కనిపించారు. ఆ పాత్రలో నటిస్తున్నంతసేపూ ఆయన వ్యక్తిత్వం, జీవన శైలినే గుర్తు చేసుకుంటూ నటించా.  అంధుడి జీవితం కదా అని, అంతా దుఃఖంతో ఉంటుందనుకోవద్దు. ఇందులో చాలా ఫన్‌ ఉంటుంది.

మీ కెరీర్‌లో నిజ జీవిత కథలతో రూపొందిన సినిమాలు ఎక్కువే. వాటిపై ఎందుకు అంత ఆసక్తి?

‘షాహిద్‌’, ‘ఒమెర్టా’, ‘బోస్‌’... ఇలా చాలా సినిమాలే చేశా. అలా కుదిరాయంతే. నిజ జీవిత కథలు, పాత్రల్ని ప్రత్యేకమైన బాధ్యతతో చేయాల్సి ఉంటుంది. ఆ పాత్రలకి, ఆ ప్రయాణాలకీ నటుడిగా పూర్తిగా న్యాయం చేయాలి. తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌గా నేను నటించా. ఆయన ఎలా ఉంటారు? ఆయన వినిపించిన గళం ఏమిటి? దేశం కోసం ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అంతర్జాలంలోనూ కావల్సినంత సమాచారం ఉంది. సినిమా విడుదల తర్వాత ప్రతి విషయాన్నీ పోల్చి చూస్తారు. అక్కడ తప్పులు కనిపించకూడదు.

మీ నట ప్రయాణంలో ఇంకా చేయాలనుకున్న బయోపిక్స్‌ ఏమైనా ఉన్నాయా? మీ నుంచి రానున్న తదుపరి చిత్రాల సంగతులేమిటి?

భగత్‌సింగ్‌ జీవిత కథలో నటించాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ఈ నెల 31నే జాన్వీ కపూర్‌తో కలిసి చేసిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ సినిమా వస్తోంది. భార్యాభర్తల బంధం నేపథ్యంలో సాగే కథ ఇది. అందరూ తమని తాము చూసుకునేలా ఉంటుంది. ‘స్త్రీ పార్ట్‌ 2’ ఆగస్టులో వస్తుంది. అక్టోబరులో మరొక సినిమా వస్తుంది.


సూర్యకు చాలా నచ్చింది

‘శ్రీకాంత్‌’ సినిమాని చూశాక...‘నీ కెరీర్‌లో గుర్తుండిపోయే మరో మంచి పాత్రని చేశావంటూ సూర్య  మెచ్చుకున్నారని చెప్పారు జ్యోతిక. తన కెరీర్‌లో టీచర్‌గా నటించడం ఇది మూడోసారని, దాంతో పాత్రని సులభంగా అర్థం చేసుకుని నటించానని చెప్పారామె. ‘‘కొన్నేళ్లుగా బలమైన మహిళా పాత్రలకే ప్రాధాన్యమిస్తూ ప్రయాణం చేస్తున్నా. దర్శకుడు తుషార్‌ హీరానందాని ‘శ్రీకాంత్‌’ గురించి చెప్పాక ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించి వెంటనే ఓకే చెప్పా. ఆ తర్వాత శ్రీకాంత్‌ బొల్లాని కలిసి మాట్లాడా. శ్రీకాంత్‌కి అండగా నిలిచిన మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్లందరినీ ప్రతిబింబించేలా నా పాత్రని తీర్చిదిద్దారు. ఇటీవలే ఈ సినిమాని నా భర్త సూర్య చూశారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. కథానాయికలకి 35 ఏళ్ల తర్వాత మరింత బలమైన పాత్రలు లభిస్తుంటాయి. వాటిపైనే దృష్టి పెడుతూ ప్రయాణం చేస్తున్నా. భాషతో సంబంధం లేకుండా మంచి పాత్ర ఎక్కడ లభిస్తే అక్కడ నటిస్తున్నా’’ అన్నారు జ్యోతిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని