Nayanthara: విఘ్నేశ్‌.. నయన్‌తో జాగ్రత్తగా ఉండు: షారుఖ్‌ సూచన

‘జవాన్‌’ (Jawan) ట్రైలర్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేసిన విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan)కు ఓ సలహా ఇచ్చారు నటుడు షారుఖ్‌ (Shah rukh).

Updated : 12 Jul 2023 15:40 IST

ముంబయి: నయనతార (Nayanthara) - విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Shivan)ని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan). నయన్‌తో జాగ్రత్తగా ఉండు.. కొట్టడంలో ఆమె కొత్త టెక్నిక్స్‌ నేర్చుకున్నారంటూ విఘ్నేశ్‌కు ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఆయన ఈ ట్వీట్‌ చేయడానికి కారణం ఏమిటంటే..  

షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ (Jawan) ట్రైలర్‌పై విఘ్నేశ్‌ శివన్‌ ఆనందం వ్యక్తం చేశారు. వీడియో తనకెంతో నచ్చిందని ఆయన పోస్ట్‌ పెట్టారు. ‘‘ఇలాంటి బిగ్గెస్ట్ చిత్రంతో అట్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉంది. ట్రైలర్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. షారుఖ్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనే నా సతీమణి నయన్‌ కల నెరవేరింది. టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’’ అని విఘ్నేశ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

దీనిపై షారుఖ్‌ స్పందిస్తూ.. ‘‘విఘ్నేశ్‌.. మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నయన్‌ అద్భుతమైన వ్యక్తి. మీకు ఇప్పటికే ఈ విషయం తెలుసు కదా..!! ఇటీవల ఆమె కొన్ని కీలకమైన పంచ్‌లు నేర్చుకున్నారు. కాబట్టి జాగ్రత్త’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

మరోవైపు, సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) సైతం ట్రైలర్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘పఠాన్‌’.. ‘జవాన్‌’గా మారారు. అత్యద్భుతమైన ట్రైలర్‌. నాకెంతో నచ్చేసింది. ఇలాంటి చిత్రాలను మనం తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. ఫస్ట్‌ డే నేను ఈ సినిమా చూస్తా’’ అని పేర్కొన్నారు.

‘పఠాన్‌’ (Pathaan) తర్వాత షారుఖ్‌ నటిస్తోన్న చిత్రం ‘జవాన్‌’. అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. విజయ్‌ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. దీంతో, షారుఖ్‌.. చిత్రబృందాన్ని అభినందిస్తూ వస్తోన్న ట్వీట్స్‌పై స్పందిస్తున్నారు. అలాగే, తమ సినిమా కోసం పనిచేసిన కీలక సభ్యులను పేరు పేరునా మెచ్చుకుంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని