Raghavendra Rao: నటుడిగా మారిన రాఘవేంద్రరావు

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. ఇంతకాలం తెరవెనకే ఉన్న ఆయన ఇప్పుడు కెమెరా ముందుకొచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి ‘పెళ్లి సందD’ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

Updated : 30 Jul 2021 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. వందకిపైగా చిత్రాలకు ‘స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌’ అని చెప్పిన ఆయన తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ‘పెళ్లి సందD’ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీ లీల కథానాయిక. ఈ చిత్రంలోనే దర్శకేంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. వశిష్టగా సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ రాఘవేంద్రరావు పాత్రకి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి. ‘సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు’ అని పేర్కొన్నారు.

సూట్‌ ధరించి, కళ్లజోడు పెట్టుకుని, బాస్కెట్‌ బాల్‌ పట్టుకుని స్టైలిష్‌లుక్‌లో దర్శనమిచ్చారు రాఘవేంద్రరావు. ఆయనతోపాటు రాజేంద్ర ప్రసాద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రోషన్‌ ఈ వీడియోలో కనిపించారు. వశిష్ట పేరుతో సాగే నేపథ్య సంగీతం అలరిస్తుంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినీ ప్రస్థానంలో నటుడిగా మరో కొత్త మైలురాయిని చేరుకుంటారని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఆయన నటనలో ప్రతిఫలిస్తుందన్నారు. పెళ్లిసందD చిత్రంలో రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉందన్న పవన్.. నట ప్రస్థానంలో తమదైన ముద్ర వేయాలని కోరారు. నటుడిగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకు ఎన్నో తరాలవారితో హావభావాలు పలికించి వెండితెరను మెరిసేలా చేసిన ఆయనకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని