The family man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ షురూ

యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో తెలుగు ద్వయం రాజ్‌, డీకే ఈ వెబ్‌సిరీస్‌ రూపొందిస్తున్నారు.

Updated : 07 May 2024 09:33 IST

యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో తెలుగు ద్వయం రాజ్‌, డీకే ఈ వెబ్‌సిరీస్‌ రూపొందిస్తున్నారు. ప్రైమ్‌ వీడియో, మనోజ్‌ బాజ్‌పేయీ సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. షూటింగ్‌ ప్రారంభమైందన్నట్టుగా ఓ క్లాప్‌బోర్డు ఫొటోని పంచుకున్నారు. బాజ్‌పేయీ ఇందులో దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్‌ తివారీగా కనిపించనున్నారు. ‘ది మిడిల్‌క్లాస్‌ గాయ్‌ అండ్‌ ఏ వరల్డ్‌క్లాస్‌ స్పై’ అనేది ఆయన ట్యాగ్‌లైన్‌. ప్రియమణి, షరీబ్‌ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, ఆశ్లేష ఠాకూర్‌, వేదాంత్‌ సిన్హా.. ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూడో భాగాన్ని రాజ్‌, డీకేలతో కలిసి సుమన్‌ కుమార్‌ రాశారు.


‘భలే ఉన్నాడే’.. పెద్ద సినిమా అవుతుంది

‘భలే ఉన్నాడే’తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు రాజ్‌తరుణ్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని దర్శకుడు మారుతి, ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. జె.శివసాయి వర్ధన్‌ తెరకెక్కించారు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో ఇటీవల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది మంచి కాన్సెప్ట్‌ ఫిల్మ్‌. ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించే చిత్రమవుతుందని భావిస్తున్నా. ఇది మన మధ్యలో జరిగే కథలా ఉంటుంది. ఇది చిన్న చిత్రంగా విడుదలై పెద్ద సినిమా అవ్వనుంది’’ అన్నారు. ‘‘పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి నేను, మారుతి కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాం. అది ఈ చిత్రంతో కుదిరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు హీరో రాజ్‌తరుణ్‌. కార్యక్రమంలో శేఖర్‌ చంద్ర, సుబ్బు, అనిల్‌, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


స్కూల్‌ చెప్పే సందేశం

నవీద్‌ ఖాన్‌, స్నేహాశర్మ, నిహారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది స్కూల్‌’. ప్లేస్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ అనేది ఉపశీర్షిక. వాల్మీకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ రెమిడాల దీన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా చిత్రీకరణను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నటులు కృష్ణ భగవాన్‌, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో జరిగే సహజ సంఘటనలకు అద్దం పట్టేలా సందేశాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఇందులో ఇంద్రజ, రాజా రవీంద్ర, జబర్దస్త్‌ కార్తీక్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


అందరూ మెచ్చేలా ‘సత్య’

హమరేష్‌, ప్రార్థన జంటగా వాలీ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘సత్య’. శివ మల్లాల నిర్మాత. ఆడుగాలం మురుగదాస్‌, సాయి శ్రీ, అక్షయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 10న రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను ఎనిమిది మంది దర్శకులతో హైదరాబాద్‌లో విడుదల చేయించారు. దర్శకులు శశికిరణ్‌ తిక్క, సతీష్‌ వేగేశ్న, పవన్‌ సాధినేని, అర్జున్‌ తదితరులు ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమా నిర్మాతగా శివకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ చూస్తుంటే అంతా కొత్తవాళ్లతో తీసిన చిత్రమని అర్థమవుతోంది. ఈ ప్రయత్నానికి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు పవన్‌ సాధినేని. దర్శకుడు వాలి మోహన్‌దాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని తమిళంలో ‘రంగోలి’గా తీశాను. ఇప్పుడు దీన్ని శివ ‘సత్య’గా విడుదల చేస్తున్నారు. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు నిర్మాత స్థాయి వరకు వచ్చాను’’ అన్నారు నిర్మాత శివ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు