Sankranti 2023: పండగ జోరు.. చూపించేదెవరు?

దసరా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరోపక్క దీపావళి చిత్రాలూ శరవేగంగా ముస్తాబవుతున్నాయి. ఇక పరిశ్రమ దృష్టంతా సంక్రాంతి సందడిపైనే ఉంది. కొన్ని నెలల కిందటి వరకూ ఈ పెద్ద పండగ రేసులో బోలెడు ప్రాజెక్టులు ఉండేవి. వాటిలో కొన్ని ఒకొక్కటిగా వెనక్కి తగ్గుతూ వచ్చాయి.

Updated : 10 Oct 2022 09:21 IST

దసరా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరోపక్క దీపావళి చిత్రాలూ శరవేగంగా ముస్తాబవుతున్నాయి. ఇక పరిశ్రమ దృష్టంతా సంక్రాంతి సందడిపైనే ఉంది. కొన్ని నెలల కిందటి వరకూ ఈ పెద్ద పండగ రేసులో బోలెడు ప్రాజెక్టులు ఉండేవి. వాటిలో కొన్ని ఒకొక్కటిగా వెనక్కి తగ్గుతూ వచ్చాయి. ఇప్పటికైతే సంక్రాంతికి పక్కా చేసిన సినిమాలు మూడు మాత్రమే. అందులో ఒకటి ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush). మరొకటి విజయ్‌ ‘వారసుడు’ (Varasudu). మూడవది చిరంజీవి 154వ సినిమా. ఇవే బరిలో దిగుతాయా? ఏవైనా వెనక్కి తగ్గుతాయా? లేదేంటే వీటికి తోడుగా ఒకట్రెండు కొత్తగా తోడవుతాయా? వేచి చూడాల్సిందే.

తెలుగులో ఇదివరకటిలా కాకుండా.. విడుదల తేదీల్ని ముందే ప్రకటిస్తూ సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇది శుభ పరిణామమే. అయితే కొన్నిసార్లు అనుకోని అవాంతరాలతో చిత్రీకరణల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. ఒక్క సినిమా ఆలస్యమైందంటే విడుదలకి సంబంధించిన క్యాలెండర్‌ మొత్తం మారిపోతుంది. అందుకే ఏ సినిమా ఎప్పుడొస్తుందో వచ్చేవరకూ పక్కాగా చెప్పలేని పరిస్థితి. కొన్నాళ్ల కిందట వరకు హరిహర వీరమల్లు, రామ్‌చరణ్‌ - శంకర్‌ చిత్రాలతోపాటు మొత్తం ఆరు సినిమాలు సంక్రాంతి పోటీకి సిద్ధమవుతున్నట్టు కనిపించాయి. కానీ ఆయా చిత్రీకరణలు అనుకున్న రీతిలో సాగలేదు. దాంతో అవి వెనక్కి తగ్గాయి. వాటిలో ‘ఆదిపురుష్‌’ మినహా మిగిలిన రెండు సినిమాలు ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. అందుకే సంక్రాంతి సినిమాలపై ఇప్పుడు కూడా పక్కాగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా అనే మాట ఈమధ్య కొన్ని రోజులుగా పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ‘అఖండ’ తరహాలో ‘డిసెంబరులో విడుదల’ ప్రణాళికతోనే పట్టాలెక్కింది. చిత్రీకరణ చాలానే చేయాల్సి ఉంది. ఒకవేళ ఆలోపు పూర్తి కాకపోతే సంక్రాంతికి రావొచ్చనేది పరిశ్రమ వర్గాల మాట. కానీ సంక్రాంతికి బెర్తులన్నీ ముందే పూర్తయ్యాయి. మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే, మరొక చిన్న సినిమాకి చోటు దక్కొచ్చేమో గానీ నాలుగోదీ ఉంటే.. అదీ అగ్ర తారలు నటించిందే అయితే థియేటర్లు దొరకడం కష్టమే. అందుకే అలాంటి ప్రయత్నం చేయరు దర్శకనిర్మాతలు. కానీ సంక్రాంతికి లక్ష్యంగా ముస్తాబవుతున్న వాటిలో కొన్ని చిత్రీకరణ దశలోనే ఉండటంతోనే నాలుగో దానికి అవకాశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. పక్కా అయినవి గడువులోగా పూర్తవడమే కీలకం.

దీపావళి బరిలో..

సంక్రాంతి సినిమాలపై స్పష్టత రావడానికి ఇంకా సమయం ఉంది గానీ... ఈలోపు దీపావళి పండగ చిత్రాలు మరోసారి ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. దసరాకి అగ్ర తారలు చిరంజీవి, నాగార్జున బాక్సాఫీసు దగ్గర సందడి చేశారు. దీపావళికి మాత్రం స్టార్ల జోరు తక్కువే. ‘ఓరి దేవుడా’లో వెంకటేష్‌ అతిథి పాత్ర పోషించారంతే. విష్వక్‌సేన్‌ నటించిన ఆ సినిమాతోపాటు.. మంచు విష్ణు ‘జిన్నా’, కార్తి ‘సర్దార్‌’, శివ కార్తికేయన్‌ ‘ప్రిన్స్‌’ విడుదలవుతున్నాయి. వీటిలో ‘జిన్నా’, ‘ఓరి దేవుడా’ ప్రచారంలో ముందున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని