వరదసాయం పంపిణీలో భారీ దోపిడీ: లక్ష్మణ్‌

అధికార తెరాస గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.

Published : 07 Dec 2020 00:52 IST

హైదరాబాద్‌: అధికార తెరాస గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన తెరాస అభివృద్ధిపై దృష్టి సారించలేదని వ్యాఖ్యానించారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లో వరద, బురద పేరుకుపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగ కల్పనలో వెనుకబడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందించలేదన్నారు. తెరాస, మజ్లిస్‌ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా కష్టకాలంలో ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేదని లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు కొమ్ముకాసి పేదలను దోచుకున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షలు ఇస్తామంటే తెరాస ప్రభుత్వం అడ్డుపడిందని లక్ష్మణ్‌ వెల్లడించారు. దుబ్బాకలో విజయం తర్వాత భాజపా మరింత దూసుకుపోతుందనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చారని ఆయన అన్నారు. తాజా గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అనేక ప్రలోభాలకు పాల్పడినట్లు లక్ష్మణ్‌ ఆరోపించారు. వరద సాయం పంపిణీలో పెద్దఎత్తున దోపిడీ జరిగిందని ఆయన అన్నారు. అధికార పార్టీతో పోరాటం చేసి గ్రేటర్‌లో భాజపా సాధించిన విజయాన్ని చూసి తెరాసకు కళ్లు చెదిరిపోతున్నాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని